ఆర్‌ఎస్ఎస్‌కు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోలికా?

విదేశి పర్యటనలో ఉండగా ఆర్ఎస్ఎస్ ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోల్చడంపై పెద్ద దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్ధనీయం కావని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు.   ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ లండన్‌ నుంచే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

నరేంద్ర మోదీపై రాహుల్‌కున్న వ్యతిరేకతను ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయని, ఒక ఛాయ్‌వాలా ప్రధాని కావడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నారని ద్వజమెత్తారు. పైగా పాక్‌ను బలపరచేలా ఆయన వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు. దేశానికి ఆర్ఎస్ చేసిన సేవలను సంబిత్ పాత్రా ప్రస్తావిస్తూ, కేరళ పునరావాసానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలు తెలుసుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. మహాత్మాగాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయంపై పలుమార్లు ప్రశ్నించిన రాహుల్ దీనిపై పరువునష్టం కేసు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మేలో సైతం ఆర్ఎస్ఎస్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో రాహుల్ పోల్చారు. ఆర్ఎస్ఎస్‌ను మహిళా వ్యతిరేకిగానూ అభివర్ణించారు.

 

కాగా లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తొలిసారిగా విదేశి గడ్డపై భారత దేశం విదేశాంగ విధానంపై రాహుల్ విమర్శనాత్మకంగా మాట్లాడటం సహితం రాజకీయంగా పెను వివాదంగా మారనున్నది. తానైతే డోక్లాం సంక్షోభాన్ని ఆపగలిగేవాడినని అంటూ చెప్పుకోచ్చారి.

ఇది సంఘటనల సమాహారంలో భాగమని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాగ్రత్తగా పరిశీలించి ఉంటే, డోక్లాం సంక్షోభాన్ని నిలువరించగలిగి ఉండేవారన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం దీనిని కేవలం ఓ సంఘటనగానే చూస్తున్నారని విచారం వ్యక్తం చేసారు. మోదీ చైనాను నిలువరించడంలో విఫలమయ్యారని అంటూ  చైనీయులు ఇప్పటికీ డోక్లాంలోనే ఉన్నారని స్పష్టం చేసారు.