సరిహద్దు దేశాలతో భారత్ అంతరిక్ష దౌత్యం

సరిహద్దు దేశాలపై చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు అంతరిక్ష దౌత్యానికి భారత్ తెరతీసింది. ఇందులో భాగంగా మన దేశానికి పొరుగున ఉన్న భూటాన్, నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలలో ఐదు భారీ గ్రౌండ్ స్టేషన్లతో పాటు 500కు పైగా చిన్న టెర్మినళ్లను నిర్మిస్తున్నది. ఈ ట్రాకింగ్, రిసీవింగ్ సెంటర్ల నిర్మాణం వల్ల ప్రాంతీయ సహకారం బలోపేతం కావడంతో పాటు, ఆయా దేశాల భూభాగాల్ల్లో మన దేశ వ్యూహాత్మక కేంద్రాలను నెలకొల్పినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

గ్రౌండ్ స్టేషన్లు, టెర్మినళ్ల నిర్మాణం వల్ల ఆయా దేశాల్లో టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్, విపత్తు నిర్వహణ, టెలీ మెడిసిన్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. సరిహద్దు దేశాల్లో మొత్తం ఐదు భారీ గ్రౌండ్ స్టేషన్లను నిర్మిస్తుండగా, మొట్టమొదటగా భూటాన్ రాజధాని థింపులో నిర్మించిన స్టేషన్‌ను ఈ నెల 15న ప్రారంభించనున్నారు. దీని వల్ల భూటాన్‌లో మారుమూల గ్రామాలకు కూడా టెలివిజన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టిబెట్‌లో చైనా నిర్మించిన శాటిలైట్ ట్రాకింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు దీన్ని కౌంటర్‌గా భావిస్తున్నారు..

సార్క్ దేశాలకు సమాచార, విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలందించే దక్షిణాసియా ఉపగ్రహాన్ని (జీశాట్-9) 2017 మే 5న ఇస్రో ప్రయోగించింది. ఇందుకోసం భారత్ రూ.450 కోట్లను వెచ్చించింది. జీశాట్ 9 ఉపగ్రహానికి కొనసాగింపుగా ఇప్పుడు సరిహద్దు దేశాల్లో గ్రౌండ్ స్టేషన్లు, టెర్మినళ్లను నెలకొల్పుతున్నది. టెలివిజన్ ప్రసారాలు, వీడియో కాన్ఫరెన్స్, డేటా మెసేజింగ్‌కు ఉపయోగపడే కొన్ని టెర్మినళ్లను గతేడాది ఇస్రో ఈ దేశాల్లో ఏర్పాటు చేసింది.

 ఇది విజయవంతం కావడంతో తమ దేశంలో భారీ గ్రౌండ్ స్టేషన్లు (7.5మీటర్ల యాంటెన్నాలు), అలాగే వాటికి అనుసంధానంగా 1.2 మీటర్-యాంటెన్నా టెర్మినళ్లను నిర్మించాలని, దాని వల్ల తమకు సొంత నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని ఆయా దేశాలు భారత్‌కు విజ్ఞప్తి చేశాయి.

అందులోభాగంగా మొట్టమొదటి నెట్‌వర్క్ భూటాన్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. బంగ్లాదేశ్‌లో ఓ భారీ గ్రౌండ్ స్టేషన్‌తో(ఢాకాలో నిర్మించనున్నారు) పాటు 100 టెర్మినళ్లను నిర్మించే విషయమై ఆ దేశ ప్రతినిధులు ఇటీవలే ఇస్రో అధికారులతో సమావేమయ్యారు. మరోవైపు 100 దీవుల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాల్దీవులు కోరుతున్నది.

భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవుల ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నేపాల్, శ్రీలంకలపై దృష్టిపెట్టనున్నట్లు చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్‌లో 100 టెర్మినళ్లు నిర్మించాల్సి ఉండగా, భద్రతా కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది.