కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి : మోదీ హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు.  పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో బిజెపి నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొంటూ దేశ రక్షణ వ్యవస్థను బలహీనపర్చేలా కాంగ్రెస్‌ అసత్యాలను ప్రచారం చేస్తోందని, దేశ భద్రతతో ఆటలాడుతోందని మండిపడ్డారు. 

ఎన్డీఏ ప్రభుత్వం కర్తార్‌పూర్‌ నడవా నిర్మాణం కోసం చారిత్రక నిర్ణయం తీసుకుందని చెబుతూ కాంగ్రెస్‌ పార్టీ దీన్ని గతంలో వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అట్లాగే, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులకు శిక్ష పడాలని దేశం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అల్లర్ల వెనుక ఉన్నవారి పట్ల, ఇప్పుడు కనీసం వందేమాతరం, భారత్‌ మాతా కీ జై అనడానికి కూడా వెనకాడుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వారించారు. 

కాంగ్రెస్‌ పార్టీ గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కానీ, అందుకు కృషి చేయలేదు. రైతులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వలేదు. కనీసం రోడ్ల సౌకర్యాలు కల్పించలేదు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలోనే రహదారుల అనుసంధానాలు ప్రారంభమయ్యాయని ప్రధాని పేర్కొన్నారు. 2008-09లో ఆ పార్టీ రూ.6 లక్షల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ, కేవలం రూ.60,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేసిందని ధ్వజమెత్తారు. 

గతంలో ఆ పార్టీ గరీబీ హఠావో అనే నినాదంతో ప్రజలను మభ్య పెట్టింది. ఇప్పుడు రైతు రుణమాఫీ అనే విషయంతో మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరను పెంచిందని, కానీ గత ప్రభుత్వం మాత్రం దీని గురించి ఆలోచించలేదని మోదీ దుయ్యబట్టారు. ఇప్పుడు మరోసారి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని హెచ్చరించారు. 

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామంటూ హామీలు ఇచ్చిందని, రైతులు ఆ పార్టీని ఇచ్చిన హామీలను నమ్మారని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కూడా రైతు రుణమాఫీ చేస్తామన్నారని, కానీ, అతి కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ చేశారని చెబుతూ పంజాబ్‌లోనూ ఇదే జరిగిందని మోదీ విమర్శించారు.

చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఎన్డీయే విధానాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని మోదీ భరోసా ఇచ్చారు. జీఎస్టీని మరింత సరళీకృతం చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు వంటి ఎన్నో నిర్మాణాలను చేపడుతోందని చెప్పారు. వీటి వల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. 

ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 11 లక్షల మందికి ఉచిత వంట గ్యాసు సదుపాయం కల్పించిందని ప్రధాని తెలిపారు. ముద్ర యోజన ద్వారా 28 లక్షల మంది లాభపడ్డారని  చెబుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.