పవన్ తో దోస్తీ కోసం చంద్రబాబు తపన... నో చెప్పిన పవన్

ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసే సాహసం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేయనే లేదు. ఎప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకొంటూ వస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఇప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే తెలుగు దేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది. ఆ రెండు సార్లు కూడా - 1999, 2014 లలో బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. 

మరో రెండు సార్లు బిజెపి లేకుండా వామపక్షాలు, ఒక సారి టి ఆర్ ఎస్ లతో పొత్తు ఏర్పాటు చేసుకొని పోటీ చేస్తే పరాజయం తప్పలేదు. అందుకనే ఇప్పుడు తిరిగి ఒంటరిగా పోటీ చేయ్యుడానికి చంద్రబాబు భయపటుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 

బిజెపితో తెగతెంపులు చేసుకొని, ఎన్డీయే నుండి బైటకు వచ్చిన తర్వాత భరోసా కోసం పార్టీ మౌలిక విధానం అయినా `కాంగ్రెస్ వ్యతిరేకత''కు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ తో నేస్తం చేయడం ప్రారంభించారు. ఆ ఆపార్టీతో కలసి తెలంగాణలో ఏర్పడిన ప్రజా కూటమిలో కీలక పాత్ర వహించారు కూడా.  అదే తరహాలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమి ఏర్పాటు చేస్తాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. 

అయితే ఆయన చెబుతున్న మహాకూటమికి చెప్పుకోదగిన స్పందన లేక పోవడంతో దిక్కు తోచడం లేదు. మరోవంక కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానితో ఇంకా అభద్రతా భావానికి గురవుతున్నారు. 

దానితో గత ఎన్నికలలో మద్దతు ఇచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దీ కాలంగా రెండు పార్టీల మధ్య తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నా అకస్మాత్తుగా అవి ఆగి పోవడంతో రెండు పార్టీలు జత కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు కూడా బయలు దేరాయి. 

అటువంటి ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా స్వయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు స్నేహ హస్తం చాపారు. మొన్నటి వరకు పవన్ ను ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్నారని విమర్శలు చేసిన ఆయనే ఇప్పుడు కలసి పోటీ చేద్దాం అంటూ బహిరంగంగా కుప్పం నుండే ఆఫర్ ఇచ్చారు. 

  ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఎవరు కలిసివస్తారో వారిని కలుపుతూ ముందుకు వెళతాం. పవన్‌కల్యాణ్‌ కూడా మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పారు. ఆయన వేసిన నిజనిర్ధారణ కమిటీలో రాష్ట్రానికి రూ.70వేల కోట్లు రావాలని తేల్చారు. ఆయన కూడా మాతో కలిసి కేంద్రంపై పోరాటానికి రావాలి...’ అంటూ చెప్పుకొచ్చారు. 

అయితే చంద్రబాబు పిలుపుకు పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించక పోయినా ఆయన పార్టీ ప్రతికూలంగా స్పందించడంతో అటువంటి అవకాశం లేదని స్ఫష్టమవుతున్నది. ఈ  మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా అధికారికంగా స్పందించింది.

 ‘జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీచేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలసి వెళ్లం. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మోద్దు. ముక్తకంఠంతో ఖండించండి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 దీంతో టీడీపీ, జనసేనల కలయిక  ప్రచారానికి బ్రేక్ పడినట్లు అయింది. మరోవంక తెలంగాణలో వలే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకోవడం పట్ల రెండు పార్టీలలో కూడా ధైర్యం చాలడం లేదని తెలుస్తున్నది. పార్టీలు కలిసినా, రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతు దారులు అందుకు సిద్ధంగా లేరని తెలంగాణ అనుభవాలు వెల్లడి చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల మార్పిడి అక్కడ జారగనే లేదు. 

తెలుగు దేశం పార్టీతో పొత్తు ప్రతికూల ప్రభావం చూపినట్లు రాహుల్ గాంధీ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకనే ఆంధ్ర ప్రదేశ్ లో అటువంటి పొత్తు గురించి ఇప్పుడు ఎవ్వరు మాట్లాడక పోవడం గమనార్హం.