తెలంగాణలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎన్నికల సందర్భంగా ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు- ములుగు, నారాయణపేట ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా (జీవో నెం.533, 534) ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని దానిలో పేర్కొంది. 

భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాను విడదీసి నారాయణపేట జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గత నెల 31వ తేదీతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని కోసం వెంటనే ప్రాథమిక ప్రకటన (నోటిఫికేషన్‌)జారీ చేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి.. భూపాలపల్లి జయశంకర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 

ఆయా జిల్లాల్లోని ప్రజల వద్ద నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అప్పుడు జిల్లాల సంఖ్య 33కు చేరనుంది.

భూపాలపల్లి నుంచి ములుగు జిల్లాను విభజించారు. ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మండలాలన్నీ ప్రస్తుతం ములుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనివే.

నారాయణపేట రెవెన్యూ డివిజన్‌లోని దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, కృష్ణ, మద్దూరు, మాగనూరు, మక్తల్‌, మరికల్‌, నారాయణపేట, నర్వ, ఊట్కూరుతోపాటు కోయిల్‌కొండను కూడా కలిపి మొత్తం 12 మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పాటు కానుంది.

రాష్ట్రంలో మరో నాలుగు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో చండూరు, మోస్రా, మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి విడదీసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు మరో ఉత్తర్వునిచ్చింది.