`బాబు' పాలనపై 'ఆగ్రహంతో ఏపీ ప్రజలు : మోదీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారని, వారు మార్పు కోరుకొంటున్నరని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసని చెబుతూ  కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖ, విజయనగరం నియోజకవర్గాల బిజెపి బూత్‌ స్థాయి కార్యకర్తలతో దిల్లీ నుంచి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారని అంటూ టిడిపి పాలనపై విరుచుకు పడ్డారు.హామీలు నిలబెట్టుకోలేకపోతేనే తనను విమర్శిస్తారని, ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఏపీలో పాలకులు ఏదైనా చేసి ఉంటే ఆ పని గురించి మాట్లాడేవారని అంటూ యువత వ్యతిరేక ప్రచారాన్ని నమ్మదని, అవినీతిని సహించదని విశ్వాసం వ్యక్తం చేశారు.  

ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలను చాలా వరకు తమ  ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మోదీ విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బిజెపి  కార్యకర్తలు తెలియజెప్పాలని సూచించారు.   

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో చేతులు కలిపి ఎదురుకొన్న అనుభవం తెలుగు దేశం పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎదురు కాక తప్పదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

నాడు ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్‌గా అభివర్ణిస్తే.. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు దోస్త్‌ కాంగ్రెస్‌ అంటున్నారని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో జరుపుతున్న స్నేహంపై విరుచుకు పడ్డారు.  తెలంగాణ తరహాలో ఏపీలోనూ మహాకూటమిని ప్రజలు తిరస్కరిస్తారుని జోస్యం చెప్పారు. 

తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ దుష్ట కాంగ్రెస్‌ అనేవారని, ఇప్పుడు టీడీపీ దోస్త్‌ కాంగ్రెస్‌ అంటోందని ఆరోపించారు.  

ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని తూర్పురబట్టారు. జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించామని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని సంస్థలు దేశచరిత్రలో ఏ రాష్ట్రానికీ దక్కలేదని ప్రధాని గుర్తు చేశారు. ఇలాంటి సంస్థలను ఏపీలో ఇంతకాలం ఏర్పాటు చేయనందుకు టిడిపి, కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని నిలదీశారు. 

ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మోదీ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని చెబుతూ మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్‌ను యువతకు వివరించమని పార్టీ కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. "యువతతో అన్ని అంశాలపై క్షుణ్నంగా చర్చించండి.. వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పండి" అంటూ సూచించారు.

 ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని,  అర్హులైన యువత ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని  అంటూ పార్టీ శ్రేణులకు మోదీ దిశానిర్దేశం చేశారు. విభజనపై మిగతా పార్టీలు రాజకీయం చేస్తుంటే ఏపీకి న్యాయం కోసం మాట్లాడింది బిజెపియే అని గుర్తు చేశారు. బిజెపి ఏం చేసిందో ప్రజలకు కార్యకర్తలు వివరించాలని చెబుతూ జనవరి 6వ తేదీన మరోసారి మీతో మాట్లాడతానని పేర్కొన్నారు.