ఏపీలో బిజెపి ఎవ్వరితో పొత్తు పెట్టుకోదు

 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణాలో ఒంటరిగా పోటీ చేశామని, అలాగే రేపు ఏపీలోనూ ఒంటరిగానే వెళ్తామని విజయనగరంలో చెప్పారు. విభజన హామీలకు సంబంధించి కేంద్రం స్పష్టంగా ఉందని కేవలం రాష్ట్ర ప్రభుత్వమే అయోమయానికి గురిచేసిందని మండిపడ్డారు. ఇతర  రాష్ట్రాల కంటే అధికంగా కేంద్రం, ఏపీకి నిధులు ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు నిజం చెప్పిన దాఖలాలు లేవని అంటూ ఆయన చెప్పే ప్రతిమాటా అబద్ధమేనని దుయ్యబట్టారు. 

జన్మభూమి కమిటీలను రద్దు చేశామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ కమిటీల ద్వారానే గ్రామాల్లో పాలన నడుస్తోందని కన్నా విమర్శించారు. జన్మభూమి కమిటీలను రాజ్యాంగేతర శక్తిగా మార్చి గ్రామీణ పాలనను నిర్వీర్యం చేసింది టీడీపీ ప్రభుత్వమేనని  ధ్వజమెత్తారు. భారతదేశమంతా చంద్రబాబు చక్రం తిరిగినట్లు తిరిగారు.. ఏ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు సిద్ధంగా ఉందని వెల్లడించారు. చంద్రబాబుకు రాజకీయం తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. 

విభజన హామీలను నెరవేర్చడానికి బాబు సహకరించడం లేదని కన్నా ఆరోపించారు. సుమారు 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, ఆయన పేరు చెప్పుకునేందుకు ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని ప్రశ్నించారు.