దేశంలో తొలిసారిగా బయో ఫ్యూయల్ విమానం

పెట్రోల్, డీజిల్, ఇతరత్రా ఇంధనాలతో కాలుష్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం అవతున్నందున జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్) వినియోగించే వాహనాలను తీసుకురావాలని ప్రభుత్వాలు ఎన్నాళ్ల నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. జీవ ఇంధనం అందుబాటులోకి వచ్చినా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలకు అది విస్తృతస్థాయిలో వినిమయంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో బయో ఫ్యూయల్‌తో విమానం నడిపేందుకు స్పైస్ జెట్ విమాన సంస్థ సిద్ధమవుతున్నది.

అన్ని సవ్యంగా సాగితే డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య సోమవారం తొలి బయో ఫ్యూయల్ విమానం నడిపి స్పైస్ జెట్ రికార్డు సొంతం చేసుకోనున్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే విమానయానానికి జీవ ఇంధనాన్ని వినియోగించిన తొలి అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ పేరు నిలిచిపోనున్నది.

తొలుత డెహ్రాడూన్ నగరం నుంచి క్యూ-400 విమానం పది నిమిషాలపాటు ఆకాశంలో చక్కర్లుకొట్టేలా స్పైస్ జెట్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.

లాస్‌ఏంజెల్స్-మెల్‌బోర్న్ మధ్య ఆస్ట్రేలియాకు చెందిన కాంటాస్ సంస్థ గత జనవరిలో బయో ఫ్యూయల్‌తో బోయింగ్ 787-9 విమానాన్ని విజయవంతంగా నడిపింది. 15 గంటల పాటు ప్రయాణించిన ఈ విమానంలో జీవ ఇంధనంగా పారిశ్రామికంగా వినియోగించే ఆవ పిండి సమ్మేళనాన్ని వాడారు. కాగా 50 శాతం వంటనూనెలను ఉపయోగించి తయారుచేసిన బయో ఫ్యూయల్‌తో 2011లో అలస్కా ఎయిర్‌లైన్స్ సంస్థ విమానాలు నడిపింది.