మధ్యప్రదేశ్‌ సచివాలయంలో నిలిచిపోయిన ‘వందేమాతరం’

మధ్య ప్రదేశ్ లో 15 ఏళ్ళ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గత పుష్కర కాలంకు పైగా ప్రతి నెల మొదటి తేదీన ఆలపిస్తున్న వందేమాతరం గీతం ఆలపించడం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఆగిపోయింది. శివరాజ్ సింగ్ చౌహన్ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత 13 ఏళ్లుగా ఆ విధంగా ఆలపిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా జనవరి 1న ఆలపించక పోవడంతో వివాదం చెలరేగింది. 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేసింది.  ఈ ఆదేశాలను సరికొత్తగా అమలు చేసేందుకు ప్రస్తుతానికి నిలిపేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ చెబుతున్నా ఎవ్వరికి నమ్మకం కుదరటం లేదు. జాతీయగీతం అంటే కాంగ్రెస్ వారికి అంత వెగటు ఎందుకనే ప్రశ్న తలెత్తుతున్నది. 

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్‌.. వందేమాతరం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని.. అది దేశభక్తిగా ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్పారు. 

ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం, దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్‌ మరచిపోరాదని హితవు చెప్పారు. అదే విధంగా మంత్రివర్గం సమావేశాల ప్రారంభానికి  ముందు కూడా వందేమాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందేమాతర గేయాన్ని ఆలపిస్తానని చౌహన్ వెల్లడించారు. 

 ‘‘మా పార్టీకి చెందిన మొత్తం 109 మంది ఎమ్మెల్యేలు జనవరి 7న భోపాల్‌లోని మధ్య ప్రదేశ్ సచివాలయం వద్ద ‘వందేమాతరం’ గేయం ఆలపిస్తారు. ఆ తర్వాతే మా ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తారు...’’ అని చౌహన్ ప్రకటించారు. అయితే వందేమాతర గేయం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా అంటూ ముఖ్యమంత్రి కమలనాథ్ డొంకతిరుగుడు సమాధానం ఇచ్చారు.