ట్రిపుల్ తలాక్ బిల్ ను ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు రాజ్యసభలో ఆమోదింప చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ బిజెపికి ఆధిక్యత లేకపోవడంతో ఈ బిల్ ను అడ్డుకోగలమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అయితే ఎట్లాగైనా ఆమోదింప చేసుకొని కాంగ్రెస్ కి పెద్ద షాక్ ఇవ్వాలని బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.
సరిగా ఐదు నెలల క్రితం మెజారిటీ లేకపోయినా డిప్యూటీ చైర్మన్ గా తాము బలపరిచిన జెడి(యు) నేత హరివంశ్ ను భారీ మెజారిటీ గెలిపించుకోవడం తెలిసిందే. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్ ను సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరుతూ త్రిణమూల్ కాంగ్రెస్ నేత బెరెక్ ఓబ్రెయిన్ తయారు చేసిన పిటిషన్ పై ఇప్పటికే 11 ప్రతిపక్షాలు సంతకాలు చేశాయి. 13 మంది సభ్యులున్న అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నది. 244 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రతిపక్షాలకు 128 మంది సభ్యులు ఉండగా, ఎన్డీయేకు 97 మాత్రమే ఉన్నారు.
అయితే ఈ సంఖ్యాబలం డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ కు తమ సీనియర్ నేత, నాలుగుసార్లు ఎంపీగా ఉన్న బి కె హరిప్రసాద్ ఎన్నిక కావడానికి ఉపయోగపడ లేదు. మొదటిసారి ఎంపీ హరివంశ్ ను బీజేపీకి గెలిపించుకో కలిగింది. సమర్ధవంతంగా తమ వ్యూహాన్ని అమలు పరచుకోవడం ద్వారా అనూహ్యంగా బిజెడి, వైసిపి, శివ సేన వంటి పార్టీల మద్దతు పొందగలిగింది.
ఇద్దరు సభ్యులున్న వైసిపి వోటింగ్ లో పాల్గొనక పోవడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించింది. వైసిపితో పాటు పిడిపి, ఆప్ సభ్యులు కూడా గైరాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కావడానికి అవసరమైన సభ్యుల సంఖ్య 119కి తగ్గిపోయింది. బిజెపి మద్దతు ఇచ్చిన హరివంశ్ కు 125 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి హరి ప్రసాద్ కు 105 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ట్రిపుల్ తలాక్ బిల్ కు ఆమోదం పొందడానికి కూడా ఇటువంటి వ్యూహాన్నే అమలు చేయడానికి బిజెపి చూస్తున్నది. తద్వారా కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్దపడుతున్నది.
శివసేన ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుంది ఊహించడం కష్టం. లోక్ సభ లో గత జులైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా బిజేపికి భాగస్వామిగా ఉంటూనే అవిశ్వాస తీర్మానం విషయంలో `పొత్తు ధర్మం'కు భిన్నంగా వ్యవహరించింది. వోటింగ్ లో పాల్గొనలేదు. అయితే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో మాత్రం బిజెపి అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది.
డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తర్వాత ఇప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్ బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టగా మారింది. ఈ బిల్ విషయంలో కూడా రాజ్యసభలో జరిగే పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.