న్యాయ ప్రక్రియ తర్వాతే రామమందిరంపై ఆర్డినెన్స్

 అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయమై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాతనే అక్కడ రామాలయం నిర్మాణంపై ఆర్డినెన్స్ జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అయోధ్య విషయమై ముందుగా న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తరువాత ప్రభుత్వంగా మా బాధ్యతను నిర్వర్తిస్తాం. ఈ సమస్యకు రాజ్యాంగం పరిధిలోనే ఒక పరిష్కారాన్ని కనుగొంటామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం అని మోదీ గుర్తు చేశారు.  అయోధ్య వివాదానికి రాజ్యాంగ పరిధిలో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

న్యాయ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలను దృష్టిలో పెట్టుకొని అయోధ్య విషయంలో ఆటంకాలు సృష్టించకుండా కాంగ్రెస్ పార్టీ తమ న్యాయవాదులను నిరోధించాలి అని ఆయన సూచించారు.   ఆ పార్టీకి చెందిన న్యాయవాదులు విచారణ ప్రక్రియ సకాలంలో ముగియకుండా అవాంతరాలు సృష్టించారని ఆయన విమర్శించారు. 

ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన శివసేన కూడా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రామ మందిరం నిర్మాణానికై ఆర్డినెన్స్ తెచ్చే విషయాన్ని పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు ముందు న్యాయ ప్రక్రియ పూర్తి కానివ్వండి. న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వంగా మా బాధ్యత ఏదైనా దాన్ని నిర్వర్తించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము అని ప్రధాని తెలిపారు. 

జనవరి 4వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఈ కేసులో రోజువారీ విచారణ జరగాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించడానికి ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం రాజ మందిరం నిర్మాణంపై ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేయడం లేదన్న ప్రశ్నకు సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ట్రిపుల్ తలాఖ్‌పై ఆర్డినెన్స్ తెచ్చామని ప్రధాని బదులిచ్చారు.

గడచిన 70 ఏళ్లు అధికారంలో ఉన్న వారు అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనకుండా అడ్డుపడ్డారన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. న్యాయప్రక్రియ కొనసాగకుండా కాంగ్రెస్ కూడా అడ్డంకులు సృష్టించకూడదు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అని మోడీ హితవు చెప్పారు. కాంగ్రెస్‌తో సహా న్యాయవాదులందరూ కోర్టులో సమైక్యంగా నిలబడి త్వరితంగా తీర్పు వెలువడేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో మోదీ చేసిన వ్యాఖ్యలు రామాలయ నిర్మాణానికి సానుకూలంగా ఉన్నాయని ఆరెస్సెస్ స్వాగతించింది. పరస్పర సంప్రదింపుల ద్వారా లేదా చట్టాన్ని తీసుకురావడం ద్వారా రామాలయాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ 1989లో బీజేపీ పాలంపూర్‌లో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని ఆరెస్సెస్ పేర్కొన్నది. 

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన హామీని మోదీ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలోనే ఆ హామీని నెరవేర్చాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే తెలిపారు.