ముందస్తుపై మరోసారి దాటవేసిన కెసిఆర్

టిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో కుడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికల గురించి స్పష్టం చేయకుండా మరోమారు దాటవేశారు. ముందస్తు ప్రశ్న లేదని కుడా స్పష్టం చేయకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండమని మాత్రమె చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు  పాల్గొన్న ఈ సమావేశం అత్యంత గోప్యంగా జరగడం ఆసక్తి కలిగిస్తున్నది. సమావేశంలోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరించారు.

ముందస్తు ఎన్నికల విషయాన్ని తనకు వదిలి వేయమని చెప్పడం ద్వారా పరిస్థితుల సానుకూలత గురించి అనుమానంలో పడిన్నట్లు భావించ వలసి వస్తున్నది. ముందుగా ఢిల్లీలో పరిస్థితులను అంచనా వేసి, అసెంబ్లీ రద్దు చేస్తే వెంటనే ఎన్నికలు జరిపే అవకాశం ఉంటేనే ముందడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు కుడా కలుగుతున్నాయి. ఈ సమావేశం కాగానే కెసిఆర్ ఢిల్లీ ప్రయాణం కావడం ప్రాధాన్యత సంతరింప చేసుకోంది.

సెప్టెంబర్ 2న జరుపనున్న `ప్రగతి నివేదన’ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను స్వయంగా వంద నియోజక వర్గాలలో 50 రోజుల పాటు రాష్ట్రం అంతా పర్యటనలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటి ఎక్కువగా బయటకు రావడం లేదని, జిల్లాల్లో అసలు పర్యటనలు జరపటం లేదని పార్టీ వర్గాలలో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఒకొక్క జిల్లాల్లో మూడు రోజుల చొప్పున పర్యటనలు జరిపి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్ష జరుపుతానని ప్రకటించి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు ఒక్క జిల్లలో కుడా పర్యటన జరపనే లేదు.

ఇప్పుడు అందరి ద్రుష్టి ప్రగతి నివేదన సభకు కనీసం 25 లక్షల మంది జనాన్ని సమీకరించడం పైననే ఉంది. ఈ సభతో జనం ఏమేరకు స్వచ్చందంగా స్పందిస్తారో అని అధికార పార్టీ నాయకులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థులను ఖరారు చేస్తామని చెబుతూ 101 నియోజక వర్గాలలో తమదే విజయం అంటూ మరోసారి కెసిఆర్ పార్టీ వర్గాలకు భరోసా ఇచ్చారు.

అంతకు ముందు కొంగరకలాన్‌లో సెప్టెంబర్ 2న నిర్వహించబోయే ప్రగతి నివేదన సభా ఏర్పాట్లను కెసిఆర్ పరిశీలించారు. సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను అక్కడున్న నేతలను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. సభకు వచ్చే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు.