మహాకూటమి విఫలం కాకతప్పదు : జైట్లీ

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షం ఏర్పాటు చేస్తున్న మహాకూటమి విఫలం కాకతప్పదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినట్లే లోక్‌సభ ఎన్నికల్లోనూ మహాకూటమి ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 

 ఒక జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ గతంలోనూ మహాకూటమిని దేశ ప్రజలు తిరస్కరించారని, ఈసారి కూడా తిరస్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి కావాలా.. వద్దా.. అనే అంశంపైనే 2019 లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయని జైట్లీ తెలిపారు. నరేంద్ర మోదీ లేదా నామరూపాలు లేని ప్రతిపక్షం నాయకుడు.. వీరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్నదే ఓటర్లు ముందున్న ప్రధాన అంశమని ఆయన ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య దేశాధ్యక్షుడి తరహా ఎన్నిక జరిగితే బాగుంటుంది.. తాము ఇలాంటి ఎన్నికలనే కోరుకుంటామని అరుణ్ జైట్లీ తెలిపారు. తెలంగాణ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు మహాకూటమి విఫలయత్నం చేసిందని గుర్తు చేశారు. మహాకూటమి తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడవేసింది.. అందుకే ఓడిపోయింది.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే జరగబోతోందని ఆయన పేర్కొన్నారు. 

లోక్‌సభ ఎన్నికలకోసం భిన్న సిద్ధాంతాలను పాటించే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడితే ప్రజలు హర్షించరని జైట్లీ తెలిపారు.  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు కృషి చేయటం అందరికీ తెలిసిందే. 

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించటం తెలిసిందే. 

అరుణ్ జైట్లీ పరోక్షంగా ఈ ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తూ మహాకూటమి ఇప్పటికే చీలిక దిశలో పయనిస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్‌డీఏ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో ప్రగతిని సాధించిందని భరోసా వ్యక్తం చేశారు.  రైతు రుణాలను మాఫీ చేయటం వంటి జనరంజక కార్యక్రమాల మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుందని హెచ్చరించారు. ఇటీవల రైతుల రుణాలను మాఫీ చేసిన కొన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా మారిందని అరుణ్ జైట్లీ చెప్పారు. 

రైతుల ఆర్థిక స్థితిగతులను బాగుచేయాలంటే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన మద్దతు ధరను పరిరక్షించే కార్యక్రమం, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన నిర్ధారిత ఆర్థిక సహాయం వంటి పథకాలు మంచివని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తల వేలాది కోట్ల రుణాలను రద్దు చేసిన ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయటం లేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను జైట్లీ కొట్టివేశారు. ఈ పోలిక ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.