2019 ఎన్నికలు 'ప్రజలు-మహాకూటమి' మధ్యే


బీజేపీ వ్యతిరేక పార్టీల ప్రతిపాదిత 'మహాకూటమి'పై ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు విసిరారు. 2019 సార్వత్రిక ఎన్నికలను 'ప్రజలు-మహాకూటమి' మధ్య జరిగే పోటీగా ఆయన అభివర్ణించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకు గాను 180 కంటే ఎక్కువ సీట్లు బీజేపీ తెచ్చుకోలేదంటూ కొందరు రాజకీయ పండితులు చేస్తున్న వాదనల్లో పస లేదని స్పష్టం చేశారు.  

జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటు కూడా తనను గద్దె దించడం కోసమే తప్ప దేశం కోసం కాదని ప్రధాని విమర్శించారు. 2014లోనూ కొద్ది మంది వ్యక్తులు ఇలాంటి అంచనాలే వేశారని గుర్తు చేశారు. గత నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులను పరిగణనలోకి తీసుకుని ప్రజలు మరోసారి బీజేపీపై నమ్మకం చాటుకుంటారని తాను బలంగా నమ్ముతున్నట్టు ప్రధాని చెప్పారు.ధీమా వ్యక్తం చేశారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో ఈ ఎన్నికలు మోదీకి, రాహుల్‌కు మధ్య జరిగే ఎన్నికలుగా అనుకోవచ్చా అని అడిగినప్పుడు 'ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారికి, వారిని అడ్డుకునే వ్యక్తులకు మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నానని నేను నమ్ముతున్నాను. 70 ఏళ్ల అనుభవం ఉన్న ప్రజలే న్యాయనిర్ణేతలు' అని మోదీ జవాబిచ్చారు. ఎజెండాను నిర్ణయించేది ఓటర్లేనని, ఓటర్ల తెలివిపై తనకు నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఎవరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారో, ఎవరు చేయరో అదే ప్రజల ఎజెండా అవుతుందని తెలిపారు. 

గతంలో అవినీతి వ్యవస్థీకృతమైన విషయం ప్రజలందరికీ తెలుసునని, రాష్ట్రాల్లో కూర్చున్న వ్యక్తులు రాష్ట్రాలను, కేంద్రంలో కూర్చున్న వ్యక్తులు కేంద్రాన్ని దోచుకున్నారని మోదీ ఆరోపించారు. అవినీతి శక్తులంతా ఏకతాటిపైకి వచ్చినప్పుడు వారి వెంట ఉండాలో వద్దో ప్రజలే నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. 

బీజేపీ వ్యతిరేక విపక్ష 'మహాకూటమి'పై మాట్లాడుతూ, ఇప్పటికీ వారు భిన్న గొంతులతో మాట్లాడుతున్నారని, వీళ్లంతా తమను తాము కాపాడుకునేందుకు ఒకరి వైపు మరొకరి ఆశగా చూస్తున్నవారేనని ధ్వజమెత్తారు.  'చేతులు చేతులు కలపడం ఓ గేమ్. వీరందరి ఎజెండా మోదీనే. దేశానికి ఏదైనా చేయాలనేది మాత్రం కాదు' అంటూ మోదీ ఎద్దేవా చేశారు. విపక్ష నేతలంతా ఒకటి కావచ్చు కానీ, దాని అర్ధం ప్రజలంతా వారితో కలిసి ఉన్నట్టు మాత్రం కాదని ఆయన తేల్చిచెప్పారు.

 ‘‘త్రిపుర, కశ్మీర్‌లోనూ మహాకూటమికి ఘోర పరాభవం ఎదురైంది. తెలంగాణలో మహాకూటమిని ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదెవరో వచ్చే ఎన్నికలు చెబుతాయి.  ఇప్పుడు బిజెపికి  వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారంతా.. కాంగ్రెస్‌ను వ్యతిరేకించినవాళ్లే.  ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్న వాళ్లను ఆ పార్టీ బలిపశువులను చేస్తోంది" అంటూ ప్రధాని ప్రతిపక్షాల విఫల ప్రయత్నాలను గురించి వివరించారు. 

దక్షిణభారత దేశంలో బిజెపి  లేదనడం అసత్య ప్రచారమని ప్రధాని కొట్టిపారవేసారు. కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. దేశం నలువైపులా బీజేపీకి  విస్తరించి ఉందని అంటూ  ప్రాంతీయ ఆకాంక్షలకు విలువ ఇవ్వడం, కలిసి సాగడం తమ  సిద్ధాంతం అని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు.