రాఫెల్‌' ఆరోపణలతో దేశ భద్రతతో కాంగ్రెస్ చెలగాటం

   తాను తప్పుచేసినట్టు నిరూపించ లేని కాంగ్రెస్ పార్టీ తనపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు నిజానికి భారత భద్రతా బలగాలను బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. రాఫెల్ డీల్‌పై కాంగ్రెస్ తనపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ రక్షణరంగాన్ని పటిష్టం చేసేందుకు సంబధించిన సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం ద్వారా దేశ భద్రతపై తాము ఎలాంటి రాజీకి తావీయడం లేదని ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు. 

'సైన్యాన్ని బలహీనపరచాలని కోరుకుంటున్న వ్యక్తులే ఆరోపణలకు దిగుతున్నారు. వాళ్లు చేస్తున్న ఆరోపణలకు బాధపడలా? లేక దేశ అవసరాలు తీర్చాలా?. ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా దేశ భద్రతే ప్రధానంగా నిజాయితీగా పనిచేయడానికే నేను కట్టుబడ్డాను. ఆర్మీ జవాన్ల ప్రాణాలను పణంగా పెట్టదలచుకోలేదు. వారి అవసరాలేమిటో తెలుసుకుని అందుకనుగుణంగా రక్షణ సామగ్రి సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాను. నాపై చేస్తున్న ఆరోపణలను ఖాతరు చేయను' అని మోదీ పేర్కొన్నారు. 

రాఫెల్‌ డీల్‌లో అనిల్ అంబానీకి అనుకూలంగా వ్యవహరించారని, ఆశ్రితపక్షపాతానికి పాల్పడ్డారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై అడిగినప్పుడు, ఇవి తనపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు కాదని, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలని ప్రధాని తెలిపారు.  'పార్లమెంటులోనూ నేను రాఫెల్ డీల్ వ్యవహారంపై సమగ్రంగా మాట్లాడాను. సుప్రీంకోర్టు సైతం దీనిపై స్పష్టత ఇచ్చింది. కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వచ్చినప్పటికీ తగిన సాక్ష్యాలు ఇవ్వలేకపోయింది. మాటలకే పరిమితమైంది' అంటూ దుయ్యబట్టారు. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రక్షణ ఒప్పందాలపై ఎందుకు వివాదాలు ముసురుకుంటున్నాయనే అంశంతో పాటు, రక్షణ కొనుగోళ్లలో మధ్యవర్తి అవసరంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందని మోదీ సూచించారు. రక్షణ ఒప్పందాలు వివాదాస్పదం కావడం ద్వారా మన బలగాలు బలహీనపడుతున్నాయని, ఈ పని చేస్తున్నది ఎవరో, అందుకు కారణం ఏమిటన్న దానిపై చర్చ జరగాలని పిలుపిచ్చారు. 

రక్షణ ఒప్పందాల్లో దళారుల ప్రమేయం ఎందుకని ప్రధాని ప్రశ్నించారు. 70 ఏళ్ల క్రితమే 'మేక్ ఇన్ ఇండియా'కు చొరవ తీసుకుని ఉంటే దళారుల ప్రమేయం ఉండేదే కాదన్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం పాటుపడటమే తన నేరమా అని ప్రశ్నించారు. 'మన రక్షణ అవసరాలేమిటో వాటిని ఇండియాలో తయరు చేయాలి. అలా చేస్తే బయట వ్యక్తులతో లావాదేవీలకు తెరపడుతుంది. టెక్నాలజీ బదలాయింపునకు నేను ప్రయత్నిస్తున్నాను' అని మోదీ చెప్పారు. రఫేల్ డీల్ వల్ల మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలకు గండి కొడుతున్నామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.