సోనియా గాంధీ కుట్రపై ఆధారాలున్నాయి

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రతిష్టను దెబ్బతీయడం కోసం సోనియా కుట్రపన్నారనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని ఆమె ఆరోపించారు. సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును ప్రస్తావిస్తూ ఈ కేసులో అమిత్ షా‌ను ఇరికించేందుకు 2010లో కాంగ్రెస్ పార్టీ సీబీఐని పావుగా వాడుకుందని ఆమె ఆరోపించారు.

‘‘ సోహ్రబుద్దీన్ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉంది. ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్టు ప్రకారమే విచారణ మొత్తం కొనసాగింది. చివరికి ఆ కేసులో సత్యమే గెలిచింది. అది కాంగ్రెస్ కుట్రే తప్ప మరోటి కాదని తేలిపోయింది...’’ అని ఆమె పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పైనా ఆమె విమర్శలు గుప్పించారు. ఈ కేసులో తన వాదన నెగ్గించుకునేందుకు సీబీఐ ఆధారాలు సృష్టించిందని ఆరోపించారు.

కాగా సోహ్రబుద్దీన్ కేసులో కుట్ర కోణాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని చెబుతూ ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 22 మంది నిందితులకు సైతం కోర్టు విముక్తి కల్పించింది.