హసీనా ఘన విజయం ... భారత్ కు గొప్ప వరం

మొత్తం దక్షిణ ఆసియాలో ఉగ్రవాదం పట్ల రాజీలేని ధృడ వైఖరి అవలంభిస్తూ, కడు  పేదరికంలో ఉన్న తమ దేశం ఆర్థికాధివృద్ది సాధించడానికి విశేషంగా కృషి చేస్తున్న షైక్ హసీనా మన పొరుగున ఉన్న బాంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా మరోసారి ఘన విజయం సాధించడం పొరుగు దేశాల నుండి పలు సమస్యలు ఎదుర్కొంటున్న భారత్ కు ఒక వరంగా భావించవచ్చు. మరోవైపు మాల్దీవిస్ లో నిరంకుశ పాలనకు స్వస్తి పలికి, భారత్ అనుకూల ప్రభుత్వం ఏర్పడిన కొద్దీ రోజులకే ఈ పరిణామం జరగడం ఒక విధంగా ఆనంద దాయకమే. 

మొత్తం ఆసియాపై ఆధిపత్యం కోసం ఒక వంక సైనికంగా బలోపేతం అవుతూ, మరోవంక దూకుడుగా వ్యవహరిస్తున్న చైనా గుప్పిట్లో పాకిస్తాన్ చిక్కుకొంటున్న సమయంలో, చైనా దురంహకార వైఖరిని ఎదుర్కోవడానికి బాంగ్లాదేశ్ లో భారత్ పట్ల స్నేహపూర్వకంగా మెలిగే ప్రభుత్వం ఏర్పడటం శుభపరిణామం. మొత్తం 300 స్థానాలు ఉండగా, వాటిల్లో 288 స్థానాలను హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ కూటమి గెల్చుకోవడం ఒక అపూర్వ సంఘటన. 

అందుకనే ఎన్నికలలో ఆమె విజయం సాధించగానే ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన తొలి విదేశీ అధినేత మన ప్రధాని నరేంద్ర మోదీ కావడం సహజం. భారత్ - బాంగ్లాదేశ్ ల మధ్య నెలకొన్న భాగస్వామ్యం దూరదృష్టిగల రెండు దేశాల నాయకత్వం క్రింద మరింతగా వికశింప గలదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.  ప్రాంతీయ అభివృద్ధి, భద్రత, సహకారం విషయాలలో రెండు దేశాల మధ్య గల సంబంధాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ భారత్  "పొరుగు దేశాలు ఫస్ట్" విధానంలో బాంగ్లాదేశ్ కేంద్ర బిందువు అని కూడా పేర్కొన్నారు. 

మన పొరుగున ఉన్న నేపాల్, శ్రీ లంక వంటి దేశాలు సహితం చైనాకు సన్నిహితంగా జరుగుతున్న సమయంలో బహిరంగంగా భారత్ అనుకూల విధానాలు ఆవలంభిస్తున్న హసీనా గెలుపొందడం విశేష ప్రాముఖ్యత నెలకొన్నది. పైగా ఆమెను వ్యతిరేకిస్తున్న బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ప్రధాని ఖలీదా జియా బహిరంగంగా పాకిస్తాన్ అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. 

హసీనా కేవలం ఖలీదా ఎత్తుగడలను ఎదుర్కోవడమే కాదు, తమ రాజకీయాలలో జోక్యం చేసుకోచూస్తున్న పాకిస్తాన్ పట్ల సహితం  కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎన్నికలలో ఖలీదాకు మద్దతుగా జోక్యం చేసుకొనే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ హై కమీషనర్ ను దేశం నుండి పంపి వేసింది. తిరిగి దేశంలోకి ప్రవేశింపనీయ లేదు. 

మరోవంక ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచారు. బాంగ్లాదేశ్ ను స్థావరంగా మార్చుకొని భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తున్న బృందాలను కట్టడి చేయడంలో భారత్ కు బాసటగా ఆమె నిలబడ్డారు. 2016లో ఢాకాలోని హోలెయ్ కేఫ్ లో ఉగ్రవాదులు దాడి జరిపినప్పటి నుండి ఉగ్రవాదులపై ఆమె  కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ధోరణి పట్ల భారత్ వలే ఆమె కూడా అనుమానంతో వ్యవహరిస్తూ వచ్చారు. విదేశాంగ విధానంలో ఆమె భారత్ కు మొదటి ప్రధాన్యత ఇస్తూ వస్తున్నారు.

దక్షిణ ఆసియాలో రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి భారత్ అధికారికంగా 500 మిల్లియన్ డాలర్ల రుణ పరిమితి అనుమతి ఇచ్చిన దేశం బాంగ్లాదేశ్ మాత్రమే కావడం గమనార్హం. ఈ రుణ పరిమితిని సైనిక శిక్షణకు కూడా విస్తరించే ప్రయత్నం జరుగుతున్నది. బాంగ్లాదేశ్ ఎన్నికల సందర్భంగా జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయకుండా, కనీసం ఎటువంటి వాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండటం ద్వారా భారత్ వ్యూహాత్మకంగా అవ్యవహరించింది. 

ఖలీదా గతంలో ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ వ్యతిరేక ధోరణులు అవలంభిస్తూ ఉండేవారు. అయితే పలు కీలక సమయాలలో భారత్ హసీనాకు అండగా ఉంటూ వస్తున్నది. గత వేసవిలో జైలులో ఉన్న ఖలీదా కు న్యాయ సలహాదారునిగా వ్యవహరిస్తున్న లార్డ్ అలెగ్జాండర్ కార్లిల్ తగు వీసాతో భారత్ లోకి అడుగు పెట్టినా ఢిల్లీ విమానాశ్రయం నుండి వెనుకకు పంపించి వేసాము. 'ఖలీదా పట్ల హసీనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటూ మన దేశంలో ఆమెకు మద్దతు కూడదీసుకోవడం కోసం కార్లిల్ ఢిల్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. 

నాలుగు సార్లు ప్రధానిగా ఎన్నికైన హసీనా తమ దేశంలో ప్రతిపక్షాలను దాదాపు తుదముట్టించడంలో విజయం సాధించారు. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఖలీదాను అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించ గలిగారు. ఆమె ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించ బడింది. 

గత వేసవిలో బాంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య సంబంధాలలో `బంగారు శకం' ఏర్పడినదని వ్యాఖ్యనించడం గమనార్హం. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న 2015లో రెండు దేశాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలలో ఏర్పడిన విశ్వాసం, భరోసాలను వెల్లడి చేస్తుంది.