రామాయపట్నం పోర్టుకు కేంద్రం సిద్దం

ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద పోర్టు ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్దంగా ఉన్నదని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు సంకేతం ఇచ్చారు. ఈ విషయమై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే అనుమతుల మంజూరుకు తాను స్వయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రామాయపట్నం పోర్టు నిర్మాణం వెనక్కి పోవడానికి ఏపీ ప‍్రభుత్వ అనుసరిస్తున్న వైఖరే కారణమని జివిఎల్ విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం సుముఖంగానే ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోర్టు వెనక్కు వెళ్తోందని దుయ్యబట్టారు.

ఇండస్ట్రీయల్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి సహాయం చేయడం లేదంటూ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.  అలాగే నిమ్జ్‌కు అనుమతులు వచ్చినా పనులు ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని జీవీఎల్ ఆరోపించారు.

అమరావతి బాండ్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని బిజెపి ఎంపి విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని జీవీఎల్ సవాల్ విసిరారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.3 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని జీవీఎల్‌ ఎద్దేవా చేసారు. ఇక్కడ రూ. 10 వేలకే లభించే రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ కోసం సింగపూర్‌లో రూ. 2 లక్షల 80 వేలు ఖర్చు చేయడం, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆయనకు చేల్లిన్చాదాన్ని ప్రస్తావించారు. రూ. 10 వేల ట్రీట్‌మెంట్‌కు లక్షల్లో ఖర్చు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ యనమల రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడానికి  అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఆస్పత్రి లేదా అని ప్రశ్నించారు.