2019లో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు తధ్యమా !

నూతన ఏడాదిలో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు తథ్యమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప   చేసిన ప్రకటన కర్ణాటక రాజకీయాలలో సంచలనాలకు దారితీసే అవకాశాలను వెల్లడి చేస్తున్నది. 2019లో తమకు అన్ని శుభ శకునాలు ఎదురవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం తధ్యం అనే భరోసా వారిలో వ్యక్తం అవుతున్నది. 

మంత్రివర్గ విస్తరణ జరిగి పది రోజులు అవుతున్నా కాంగ్రెస్ పార్టీలో ఇంకా అసమ్మతి చల్లారక పోవడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి తన మద్దతు దారులకే ప్రధానంగా మంత్రి పదవులు కట్ట బెట్టడం, వారికి కీలక మంత్రిత్వ శాఖలు సహితం కేటాయించేటట్లు చూడటం కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అసహనాన్ని కలిగిస్తున్నది. సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను కాకుండా తెర వెనుక ఉండే తానే ప్రభుత్వాన్ని నడపడం కోసం ప్రయత్నిస్తున్నట్లు పలువురు కాంగ్రెస్ నేతలు రగిలి పోతున్నారు. 

కాంగ్రెస్‌ అసమ్మతికి కేంద్ర బిందువుగా ఉన్న మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి వ్యూహం అంతుపట్టక సొంత పార్టీ నేతలే తలలు బాదుకుంటున్నారు. ఆయనతో పాటు  దాదాపు 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. అయితే  తమ బలం 15కు చేరుకున్నాకే కొత్త ఏడాదిలో సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చే ఆలోచనలో వారు ఉన్నట్టు చెబుతున్నాయి. ఈ కథనాలను బీజేపీ వర్గాలు కూడా దాదాపుగా ధృవీకరించడం ఆసక్తిని కలిగిస్తున్నది. 

"అంతట మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయం. ఒకవేళ కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చితే అప్పుడు రాజకీయంగా చక్రం తిప్పుతాం" అని బీజేపీ వర్గాలు తాము అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. 

మరోవంక మూడు రోజుల పాటు ఢిల్లీలో గడిపిన బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సోమవారం బెంగళూరుకు  తిరిగివస్తూనే జేడీఎస్‌, కాంగ్రె్‌సలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతన సంవత్సరంలో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రజలకు అంతా శుభమే జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తానికి 2019లో రాష్ట్రంలో రాజకీయ మార్పులు తథ్యమని భావిస్తున్న బీజేపీ నేతల ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.