కాంగ్రెస్ అంటే కరప్షన్, కమిషన్, కలెక్షన్

కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ దేశం పట్ల బాధ్యత ఫీల్ కాలేదని , పంచభూతాల్లో ఆ పార్టీ అవినీతికి పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కమిషన్, కలెక్షన్ అనేపేరు గడించిందని, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ నేతృత్వంలో కుంభకోణాల మయమైందని విమర్శించారు.  నీరు, నిప్పు, గాలి, నేల, పాతాళం దేనినీ వదలకుండా పంచభూతాలలో కుంభకోణాలు చేశారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ, ప్రజల రక్షణ పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదని, వాళ్ల డిఎన్‌ఏలోనే దోపిడీ ఉందని స్పష్టం చేశారు.  ఇటీవల అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ నిందితుడ్ని భారత ప్రభుత్వం దేశానికి తీసుకువచ్చిందని, ఆయన వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ, సోనియా, రాహుల్ ఇతర నేతలు బెంబేలెత్తిపోతున్నారని వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

దొంగ దోంగ అని దోంగే అరచినట్టు రాహుల్‌గాంధీ ప్రవర్తిస్తున్నారని అంటూ  వాళ్ల దోపిడీ బయటపడుతోందని చెప్పారు. వాళ్లు ఊచలు లెక్కించే రోజు దగ్గర్లోనే ఉందని వెల్లడించారు.  అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్లు కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని మొదట ఇటలీ కోర్టు తెలిపిందని, ఇటలీలోని ఆ ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొంత మందిని అరెస్టు చేసిందని పేర్కొన్నారు. ఇటలీ కోర్టులో పలుమార్లు సోనియాగాంధీ పేరు ప్రస్తావనకు వచ్చిందని, అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం నిందితుడు క్రిస్టియన్ మిషల్ కూడా మిసెస్ గాంధీ పేరు ప్రస్తావించారని డిసెంబర్ 29న ఈడీ, పాటియాలా కోర్టుకు తెలిపిందని గుర్తు చేశారు. 

గత 30-32 సంవత్సరాలుగా దేశంలో జరిగిన కుంభకోణాల్లో అండర్సన్‌ను గానీ, ఖత్రోచీని గానీ, ఇపుడు క్రిస్టియన్ మిషల్‌ను గానీ తీసుకుంటే వారందరికీ గాంధీ కుటుంబంతో ఏదో ఒక రూపంలో సంబంధం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని లక్ష్మణ్ నిలదీశారు. ఈ కుంభకోణం నుండి సోనియా, రాహుల్ కుటుంబం తప్పించుకోలేదని అంటూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దోపిడీని నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. మోదీ నేతృత్వంలోని దోపిడీ దారులకు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.