సభ్యులెవరూ వెల్‌లోకి రావద్దు


కొత్త సంవత్సరం నుంచి సభ్యులెవరూ వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేయడం వంటివి చేయొద్దని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ్యులను సున్నితంగా మందలించారు. నిబంధనల ప్రకారం ప్రవర్తించాలని కోరారు. రఫేల్‌ ఒప్పందం, కావేరీ జలాల విషయంపై కాంగ్రెస్‌, అన్నాడీఎంకే నేతలు సోమవారం సభలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ఇరు పార్టీలకు చెందిన ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీనిపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ఈ ఏడాదికి ఇది చివరి రోజు. మీరు సభలోని వెల్‌లోకి వచ్చి ఆందోళన చేసేందుకు కూడా ఇదే చివరి రోజు కావాలి. కొత్త ఏడాది నుంచి వెల్‌లోకి ఎవరూ రావద్దు’ అంటూ సభ్యులకు సూచించారు.  వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేయడం తగదని, నిబంధనలను అనుసరించి సభ్యులు నడుచుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న లోక్‌సభకు సెలవు అని, మళ్లీ బుధవారం నుంచి సభ యథావిధిగా జరుగుతోందని వెల్లడించారు.

 గతేడాది వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష నేతలు స్పీకర్‌ మహాజన్‌పైకి పేపర్లు విసిరేసిన విషయం తెలిసిందే. గోసంరక్షణ పేరిట జరుగుతోన్న దాడుల గురించి సభలో చర్చ జరగాల్సిందిగా ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. ఆ సమయంలోనే కొందరు నేతలు ఆమెపైకి పేపర్లను విసిరేశారు. దీనిపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.