హసీనాకు ప్రధాని మోదీ అభినందనలు

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి మరోసారి ప్రధాని కాబోతున్న షేక్‌ హసీనాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మోదీ  హసీనాకు ఫోన్‌ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 300 స్థానాలున్న బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో షేక్‌ హసీనా పార్టీనే 288స్థానాల్లో గెలుపొంది భారీ విజయం సాధించింది. దీంతో హసీనా నాలుగోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టబోతున్నారు.

నరేంద్ర మోదీ హసీనాకు ఫోన్‌ చేసి అభినందించారని, దూర దృష్టి కలిగిన ఆమె నాయకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, సత్సంబంధాలు కొనసాగుతాయని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రజాస్వామ్యం, అభివృద్ధిలో నమ్మకాన్ని ఉంచిన బంగ్లాదేశ్‌ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొంది. 

హసీనా కూడా మోదీకి ధన్యవాదాలు తెలిపారని, తనను అభినందించడానికి ఫోన్‌ చేసిన మొదటి నేత మోదీనే అని చెప్పారని ఎంఈఏ వెల్లడించింది. ఇరు నేతల మధ్య సంభాషణ రెండు దేశాల స్నేహబంధాన్ని ప్రతిబింబించిందని తెలిపింది.