కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన కొత్తపల్లి గీత

‘జన జాగృతి పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. మహిళా ప్రాధాన్యంగా కొత్త పార్టీ సాగుతుందని ఆమె ప్రకటించారు. గత ఎన్నికలలో వైసిపి ఎంపిగా గెలుపొందిన ఆమె ఆ పార్టీకి దూరమై కొంతకాలం తెలుగు దేశం పార్టీకి సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో చేరుతారనే అభిప్రాయం కలిగించారు. ఆ తర్వాత బిజెపికి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు ఈ నెల 21వ తేదీన ఎంపీ పదవికి రాజీనామా చేసి స్పీకర్‌కు సమర్పించిన అనంతరం రాజకీయ పార్టీని ప్రకటించారు.  వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్టానని తెలిపారు.

జనజాగృతి పార్టీ మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తుందని ఆమె స్పష్టంచేశారు. మిగిలిన కులాల వారికి సమానంగా టికెట్లు ఇస్తామని చెబుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఎమ్మెల్యే మీద 6 నెలలకు సోషల్ ఆడిట్ చేయిస్తామని తెలిపారు. సమగ్రమైన మెనిఫెస్టోని జన జాగృతి పార్టీ త్వరలో ప్రకటిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో వ్యవస్థ అవినీతిమయం అయిందని అంటూ ఆమె ఏపీలో రాజకీయం రెండు కుటుంబాల మధ్యే కొనసాగుతుందని దయ్యబట్టారు. 90 శాతం మంది మిగిలిన కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని, మహిళలను ఎదగనీయకుండా అణగదొక్కుతున్నారని విమర్శిస్తూ అందుకే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

నారా లోకేశ్‌కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రజల దేవాలయమైన అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. కులాధిపత్యంతోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని గీత ఆరోపించారు.

రాష్ట్రంలో అరాచకపాలన ‌జరుగుతోందని అంటూ ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్లరని, ఎంత సేపు అధికార దాహమే జగన్ లో కనిపిస్తోందని దయ్యబట్టారు. లక్ష కోట్లు మీరు తిన్నారంటే మీరుతిన్నారంటూ ఆరోపణలతోనే టిడిపి, వైసిపి పాలన సాగిస్తున్నాయని చెబుతూ 70 ఏళ్లై స్వాతంత్ర్య వచ్చినా ఇంకా ఏపీలో మంచినీటి సమస్య ఇంకా ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.