విదేశాలకు తీసుకెళ్లుంటే జయలలిత బతికేవారు

 తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సరైన చికిత్స అందించలేదని తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోపించారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే అమ్మ జయలలితను మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించి ఉంటే ఆమె బతికి ఉండేవారని ఆయన స్పష్టం చేశారు. 

 జయలలితను విదేశాలకు తీసుకెళ్లకుండా ఉండేందుకు కావాలని కుట్రలు పన్నినట్లు ఆయన ఆరోపించారు. ‘జయలలితకు యాంజియోగ్రామ్‌ చేయడాన్ని ఎవరు వ్యతిరేకించారు? అమ్మ మృతి వెనుక అన్నీ అనుమానాలే దాగి ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించి నిజ నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలి’ అని షణ్ముగం డిమాండ్‌ చేశారు.

తమిళనాడు ఆరోగ్యశాఖ సెక్రటరీ జె.రాధాకృష్ణన్‌, అపోలో ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి కుట్రలు పన్ని అమ్మకు సరైన చికిత్స అందించలేదంటూ కేసు విచారిస్తున్న కమిషన్‌ కౌన్సిల్‌ ఆరోపిస్తోంది. జయలలిత హాస్పిటల్‌లో చీఫ్‌ సెక్రటరీగా ఉన్న పి.రామమోహనరావు‌ చికిత్సకు సంబంధించి తప్పుడు ఆధారాలు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను హెల్త్‌ సెక్రటరీ రాధాకృష్ణన్‌, అపోలో హాస్పిటల్స్‌ తోసిపుచ్చింది. కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాధాకృష్ణన్‌ ఖండించారు.

2016 సెప్టెంబరు 22న జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 75రోజుల పాటు చికిత్స పొందిన అమ్మ.. అదే ఏడాది డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. అమ్మ మృతిపై పలు అనుమానాలు రేకెత్తడంతో అన్నాడీఎంకే ప్రభుత్వం విచారణ కమిటీకి ఆదేశించింది. వచ్చే నెల ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు కీలక నేతలను ఈ కేసులో భాగంగా విచారణ జరపనున్నారు.