వంద రోజులల్లో 20 రాష్ట్రాలలో ప్రధాని మోదీ ప్రచార యాత్ర !

2019 సంవత్సరం ప్రారంభం కావడంతో దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. మరో వంద రోజులలో ఎన్నికల పక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉండడంతో, అందరికన్నా ముందుగా ఉదృతంగా ఎన్నికల ప్రచారం  జరపడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంసిద్ధం అవుతున్నారు. వంద రోజులలో 20 రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటనలు జరపడానికి భారీ ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు. 

2014 మోదీ ప్రభంజనంలో కూడా బిజెపి పోటీ చేసినా గెలుపొందలేని 123 సీట్లను ప్రధాన లక్ష్యంగా చేసుకొని `మిషన్ 123' పేరుతో ఒక ప్రత్యేక వ్యూహాన్ని బిజెపి సిద్ధం చేసింది. గత ఎన్నికలలో బిజెపి గతంలో ఎన్నడూ లేని విధంగా 282 సీట్లను గెలుపొందడం తెలిసిందే.  రాయితీ పార్టీ గెలువలేని  సీట్లను 25 భాగాలుగా చేసి, ఒకొక్క భాగానికి ఒకొక్క  పార్టీ నేతను ఇన్ ఛార్జ్ గా నియమించారు. 

రాబోయే వంద రోజులలో ప్రధాని ఈ 25 విభాగాలలో పార్టీ కార్యకర్తలలో ఉత్తేజం నింపడం కోసం ప్రధానంగా మోదీ పర్యటనలు జరుపుతారు. బిజెపి కేవలం 10 సీట్ల మాత్రమే గెలుపొందిన 77 లోక్ సభ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా లలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. 

ఇప్పటికే దేశంలో అత్యంత ప్రజాదరణ గల నేతగా మోదీ మాత్రమే ఉండడం, మరే నేత కూడా ప్రజాదరణతో ఆయనకు సమీపంలో లేక పోవడంతో ఆయన మాత్రమే సుస్థిరమైన ప్రభుత్వం అందిస్తారనే అంశంపై తిరిగి ప్రజా విశ్వాసం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు.  

అయితే ఈ సందర్భంగా మోదీ జరిపే పర్యటనలు పార్టీ కార్యక్రమాలు వలే  కాకుండా ఎక్కువగా అధికార కార్యక్రమాలుగా లేదా ప్రజలతో కలివిడిగా తిరిగే కార్యక్రమాలుగా ఉంటాయి. గత వారం డిసెంబర్ 24న ఒడిశాలో ప్రధాని భువనేశ్వర్ లో కొత్త ఐఐటి ప్రారంభోత్సవంలో పాల్గొని, ఖుర్దా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ మరుసటి రోజున డిసెంబర్ 25న అస్సాంలో దేశంలోని అతి పెద్ద రైల్ - రహదారి వంతెనను ప్రారంభించారు. 

జనవరి 4న తిరిగి అస్సాం లోని సిల్చార్ లో పర్యటిస్తున్నారు. అస్సాంలో గల 14 లోక్ సభ సీట్లలో 11 సీట్లు గెలుపొందాలని బీజేపీ లక్ష్యంగా  పెట్టుకోంది. జనవరి 5న మయూరభంజ్ లో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. జనవరి 15న మరోసారి అస్సాంలో పర్యటించే అవకాశం ఉంది. 

నిర్ధేశించిన వివిధ వర్గాల ఓటర్లను చేరుకొనేందుకు ఏడు వివిధమైన ప్రత్యేక విభాగాలను బిజెపి కార్యరంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తున్నది. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, యువత వంటి ప్రత్యేక వర్గాలను దృష్టిలో ఉంచుకొని పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. డిసెంబర్ నుండి మార్చ్ లోగా ఈ విభాగాలు అన్ని ఆయా వర్గాల ప్రజలలోకి  చొచ్చుకు వెళ్లేందుకు  ప్రణాళికలను రూపొందించడం కోసం సదస్సులు జరుపనున్నాయి. 

ఉదాహరణకు మొదటిసారిగా ఓట్ హక్కు పొందుతున్న వారిని ఆకట్టుకోవడం  కోసం పూనమ్ మహాజన్ నేతృత్వంలోని యువ మోర్ఛాకు 14 అంశాల కార్యక్రమం నిర్ధేశించారు. తిరిగి మోదీని ప్రధానిగా ఎన్నుకోవడం కోసం కృషే చేసేందుకు యువ ఓటర్లతో బృందాలను ఏర్పాటు చేయడం కోసం జనవరి 12 నుండి `నేషన్ విత్ నమో' స్వచ్చంద సేవకుల నెట్ వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాలలో విశేష ప్రతిభను కనబరచిన యువ పారిశ్రామిక వేత్తలు కావచ్చు, కర్షకులు కావచ్చు - అటువంటి వారిని గుర్తించి వారిని నమోకు మద్దతు తెలుపమని కోరతారు. 

`పెహ్లా  ఓట్ మోదీ' (మొదటి ఓట్ మోఢీకి)  పేరుతో మొదటిసారి ఓటు వేయబోతున్న వారిని తమ మొదటి ఓట్ ను మోదీకె వేస్తామని ప్రతిజ్ఞ తీసుకొనే విధంగా ప్రచారం చేబడతారు. ఈ కార్యక్రమాన్ని సహితం దేశ వ్యాప్తంగా జనవరి 16 నుండి 22 వరకు జరుపుతారు. అందుకోసం సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

ఇదే సమయంలో పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ ని బలోపేతం చేయడం పట్ల పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు.  వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా ప్రయోజనం పొందిన 22 కోట్ల మంది ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకొనే  విధంగా ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే ఒక కార్యకర్తల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

ఢిల్లీలో జనవరి 11, 12 తేదీలలో జరిగే జాతీయ మండలి సమావేశంలో 15 వేల మంది పార్టీ కార్యకర్తలు పాలగోననున్నారు.  జిల్లా స్థాయి పార్టీ నేతలను కూడా ఆహ్వానించి ఇంత భారీ స్థాయిలో పార్టీ జాతీయ మండలి సమావేశాన్ని మొదటిసారిగా బిజెపి జరుపుతున్నది.