పేదరిక నిర్మూలన, రక్షణ, భద్రతా రంగాల్లో ఘనమైన ప్రగతి

పేదరిక నిర్మూలన, రక్షణ, భద్రతా రంగంలో స్వయం సమృద్ధి, త్రివిధ దళాల అణ్వాయుధీకరణతోపాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మంచిపేరు తీసుకురావటంలో గణనీయమైన ఫలితాలను సాధించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నరేంద్ర మోదీ ఆదివారం  ఆకాశవాణిలో దేశ ప్రజలకు ‘మనసులోని మాట’ను వినిపిస్తూ 2018లో ఈ మూడు రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించామని తెలిపారు.

 గత సంవత్సరం న్యూక్లియర్ ట్రియాడ్ అంటే భూమి, గగనం, సముద్ర జలాల నుండి అణ్వాయుధాలను ప్రయోగించే స్థాయికి చేరుకున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. పేదరిక నిర్మూలనకు తీసుకున్న చర్యలు గత సంవత్సరం సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొన్నారు. దేశం సాధించిన గణనీయమైన ప్రగతిని ప్రపంచ దేశాలు సైతం ప్రశంసించాయని నరేంద్ర మోదీ ప్రకటించారు.

 సరళీకృత వ్యాపారం విషయంలో కూడా భారతదేశం మంచి ప్రగతిని సాధించింది.. మనం కలిసికట్టుగా పనిచేయటం వల్లే ఈ లక్ష్యాన్ని సాధించగలిగామని తెలిపారు.  2018 సంవత్సరం మనందిరికీ చిరస్మరణీయం.. ఎందుకంటే ఈ సంవత్సరమే కోట్లాది మంది ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ భారత్’ ప్రారంభమయింది. దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందిందని నరేంద్ర మోదీ ప్రకటించారు. 

దేశ ప్రజలు పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పని చేయటం వలన స్వచ్ఛ భారత్ లక్ష్యం 95 శాతానికి చేరుకున్నదని ప్రధాన మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 15నుండి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న కుంభమేళా మన అద్భుత సాంస్కృతిక వారసత్వమని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి, సభ్యతకు అద్దంపట్టే కుంభమేళా స్వీయ ఆవిష్కరణకు వీలుకల్పించే మహత్తర అవకాశమని చెప్పారు. ప్రపంచాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూసేందుకు వీలు కల్పించే కుంభమేళాకు వచ్చే ప్రతి ఒక్కరు ఏదోఒకటి తెలుసుకుంటారు.. ఎంతోకొంత జ్ఞానం, విజ్ఞానం సంపాదించుకుంటారని ప్రధాన మంత్రి తెలిపారు. 

యునెస్కో గత సంవత్సరం కుంభమేళాను మానవాళి సాంస్కతిక వారసత్వమని ప్రకటించిందని.. ప్రపంచం మనకు ఇచ్చిన గుర్తింపునకు ఇది నిదర్శమని నరేంద్ర మోదీ వివరించారు. మన సమాజంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మొక్కవోని ధైర్యం, పట్టుదల ఉంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మంచి ఫలితాలను సాధించవచ్చునని పేర్కొన్నారు. 

 జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన హనయా కొరియాలో జరిగిన కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించటం, పూణెకు చెందిన వేదాంగి, రజని జూనియర్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించటం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ మొక్కవోని ధైర్యం, పట్టుదల ఉంటే ఇలాంటి ఫలితాలను సునాయసంగా సాధించవచ్చునని చెప్పారు. 

నరేంద్ర మోదీ దేశ ప్రజలకు లోరి, పొంగల్, మరక సంక్రాంతి, ఉత్తరాయణ్, మాఘ బిహు, మాఘి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలన్నీ పంటలు, రైతులు, గ్రామాలకు ప్రతీకలని అన్నారు. ఈ పండుగలన్నీ మన దేశం గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తున్నాయని తెలిపారు.