ఐటీ దాడితో కర్ణాటక మంత్రులలో కలవరం

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వ్యవహారాలను చూస్తుండే ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ సునీల్‌ నివాసంతో పాటు కార్యాలయంపైనా ఏక కాలంలో ఐటీ దాడులు జరగడంతో  మంత్రులతో పాటు పలువురు అధికారులలో కలవరం కలిగిస్తున్నది. సీఎం కుమారస్వామిని మానసికంగా దెబ్బతీసేందుకే ఈ ఐటీ దాడి జరిగిందని విమర్శలు జరుపుతున్నా అక్రమ లావాదేవీలు ఎక్కడ బయట పడుతాయో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

దాడి ఆరంభమైన కాసేపటికే కొందరు కీలక మంత్రులు నేరుగా సీఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కేవలం ఛార్టెడ్‌ అకౌంటెంట్‌పై దాడితోనే సరిపెట్టుకుంటారా? లేక మా పైనా దాడులు కొనసాగునున్నాయా అని పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సునీల్ ముఖ్యమంత్రికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు, ఎకౌంటు లనే కాకుండా ఆయన భార్య, కుమారుడి వ్యవహారాలు కుడా చూస్తుంటారు. ఎన్నికలలు జెడిఎస్ కోసం కుమారస్వామి వసూలు చేసిన విరాళాల వివరాలను కుడా చూస్తుంటారని చెబుతున్నారు.

ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ సునీల్‌ నివాసమైన జేపీనగర్‌తో పాటు గుట్టహళ్ళిలోని కార్యాలయంలోను పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏమాత్రం ఆధారాలు లభించినా ప్రభుత్వంలోని కీలకులకు ఇబ్బంది తప్పదనిపిస్తోంది.

ఇలా ఉండగా, కుమారస్వామి ప్రభుత్వంలో ఒక కీలక మంత్రికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థపై రెండు, మూడు రోజులుగా దాడులు జరుపుతున్న ఐటి అధికారులు, తమకు లభించిన కొంత సమాచారం మేరకే సునీల్ పై దాడి చేసారని తెలుస్తున్నది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుడా ఒక సారి సునీల్ పై ఐటి దాడులు జరిగాయి. ఆ శాఖ అధికారుల పరిశీలనలో ఉన్నందున జాగ్రత్తగా ఉండమని పోలీస్ ఉన్నతాధికారులు సహితం ఆయనను వారించిన్నట్లు తెలుస్తున్నది.