అమర్యాద, అహంభావం, అహంకారంలతో మాట్లాడుతున్న కేసీఆర్ !

రెండు తెలుగు రాష్ట్రాలకు  ఇద్దరు చంద్రులు గ్రహణంలా పట్టారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్  కే లక్ష్మణ్ ధ్వజమెత్తారు. సీఎంలు కేసీఆర్, చంద్రబాబు కారణంగా రెండు రాష్ట్రాల ప్రతిష్ట దిగజారుతోందని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడిన తీరు సమాజం తలదించుకునేలా ఉందని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచి అమర్యాద, అహంభావం, అహంకారంలతో మాట్లాడుతున్నారని విమర్శించారు. 

ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే ఓడిపోలేదని, మీ కేబినెట్‌లోని నలుగురు మంత్రులు ఓడిపోయిన సంగతిని మర్చిపోవద్దని కేసీఆర్ కు హితవు చెప్పారు. అధికారంలో ఉన్నప్పటికీ.. మీ ఎమ్మెల్యేలు కూడా డిపాజిట్ కోల్పోయిన సంగతి కూడా మర్చిపోవద్దని కోరారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడినప్పటికీ.. తాము  మాత్రం ప్రజల పక్షానే నిలబడుతున్నామని స్పష్టం చేశారు. 

ఓడిపోతే ఇంట్లో కూర్చుంటామని కేసీఆర్ చెప్పిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఎస్సీలను ఎన్నికల తర్వాత బీసీలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అని తెలిపారు. ఒక్క మహిళా మంత్రి కూడా నియమించకుండా చిన్నచూపు చూసినా చరిత్ర కూడా ఆయనకే ఉందని ఎద్దేవా చేశారు. 

రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానాల పేర్లు చెప్పి తప్పిం చుకునే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్  విమర్శించారు. రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని 2010 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతిని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి పాలకులు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతిని గుర్తు చేశారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాలలో బీసీ జనాభా గణన ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.

బీసీలపై కేసీఆర్‌కు అంత ప్రేమ ఉంటే.. సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు. అలా చేయకుండా.. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాపై ఎదురు దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగబద్దత కల్పించిన మోడీని విమర్శించే నైతికహక్కు కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకే  కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఈ చర్యలను తాము అడ్డుకుంటామని ప్రకటించారు.