ప్రముఖ దర్శకుడు మృణాల్‌ సేన్‌ కన్నుమూత

ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్‌ సేన్‌(95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దక్షిణ కోల్‌కతా భవానీపూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పద్మభూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్న మృణాల్‌.. 1955 వచ్చిన ‘రాత్‌భోరే’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు.

 ఆ తర్వాత ‘నీల్‌ అక్షర్‌ నీచే’, ‘పడాతిక్‌’, ‘భువన్‌ షోమే’, ‘అకాలర్‌ సాంధానే’, ‘ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌’ లాంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

మృణాల్ సేన్ 1923 మే 14న బంగ్లాదేశ్‌లోని ఫరిద్‌పూర్‌లో జన్మించారు. బంగ్లాదేశ్‌లో పాఠశాల విద్య అభ్యసించిన అనంతరం ఆయన కోల్‌కతా వచ్చారు. స్కాటిష్ చర్చి కాలేజీలో చదివారు. కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నారు.

 'రాజ్ భోరె' చిత్రంతో 1955లో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత 'భువన్ షోమె', 'మృగయ', 'అకలెర్ సంథానే', 'కోల్‌కతా 71' వంటి చిత్రాలు రూపొందించారు. పలు జాతీయ అవార్డులు అందుకున్నారు.

 2005లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ అవార్డును అందుకున్నారు.1983లో పద్మభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించింది. ప్రపంచ సినిమా స్థాయికి బెంగాలీ సినిమాను తీసుకెళ్లిన మృణాల్ సేన్ మృతితో బెంగాలీ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

మృణాల్ సేన్  మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినిమాలలో సున్నిత్వానికి అవకాశం కల్పించిన ఆయన చిత్రాలు పలు తరాలకు చెందిన ప్రజలపై ప్రభావం చూపాయని కొనియాడారు. 

మృణాల్ సేన్ మృతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. మృణాల్ సేన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

మృణాల్‌ మృతిపట్ల బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, నందితా దాస్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మృణాల్‌ తెరకెక్కించిన ‘భువన్‌ షోమే’ చిత్రం ద్వారా అమితాబ్‌ తన డబ్బింగ్‌ కెరీర్‌ను మొదలుపెట్టారు. సోమవారం కోల్‌కతాలో మృణాల్‌ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.