లెర్నింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ సీట్లో రాహుల్

బిజెపికి  వ్యతిరేకంగా పోటీ చేసేందుకు మహాకూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న రాహుల్‌ గాంధీ తీరు లర్నింగ్‌ లైసెన్స్‌ లేకుండా డ్రైవర్‌ సీటులో కూర్చొని వాహనాన్ని నడుపుతున్నట్లు ఉందని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ  ఎద్దేవా చేశారు . దాన్ని ఆయన ఏ గోతిలోకో తీసుకెళతారు. ఈ విషయాన్ని అనుభవం ఉన్న రాజకీయనాయకులు అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు.   

అనుభవం లేని రాహుల్‌ వెంట ఉండాలని అనుభవం ఉన్న నేతలు భావిస్తున్నారని సెహెబుతూ కొందరు ప్రతిపక్ష నేతలు ఇష్టం లేకపోయినా రాహుల్ ను పొగుడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. 

2014లో తాము  నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని ప్రచారం చేశామని చెబుతూ ఈ సారి ఆయన చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుని పోటీ చేస్తామని చెప్పారు. రైతుల కోసం బీమా పథకం వంటి చాలా పథకాలకు ప్రవేశపెట్టామని చెబుతూ భవిష్యత్తులో వారి సంక్షేమం కోసం మరిన్ని పనులు చేస్తామని నఖ్వీ తెలిపారు. 

దేశంలో జరుగుతున్న దళితులపై దాడుల గురించి ఆయన మాట్లాడుతూ... ‘ఇవి సాధారణ నేరాలు కాదు. క్రూరమైన నేరాలు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాయి. నిందితులపై చర్యలు తీసుకుంటున్నాయి’ అని కేంద్ర  కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

తమ ప్రభుత్వ పాలనలో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడా చోటుచేసుకోవట్లేదని నఖ్వీ గుర్తు చేశారు. ‘దేశంలో ఉగ్రవాద దాడులు ఎక్కడా జరగడం లేదు. వారి కార్యకలాపాలను సమర్థంగా అరికడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా మైనార్టీ యువతను, అమాయకులను అరెస్టు చేసేవారు. ఎన్డీఏ పాలనలో మాత్రం ఇటువంటి చర్యలు జరగడం లేదు. దేశంలో మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారని చెప్పారు. 

కొన్ని రాజకీయ శక్తులు దేశంలో అసత్య ప్రచారాలు చేస్తూ కొందరిలో భయాన్ని నింపుతున్నాయని నఖ్వీ  మండిపడ్డారు. తాము ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయామని, అయితే దీనిపై సమీక్ష జరిపి, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మళ్లీ కృషి చేస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు.