కేంద్రం 2014 నుండి ఏపీకి రూ 1.23 లక్షల కోట్ల విడుదల

రెవెన్యూలోటు, స్థానిక సంస్థలు, జాతీయ ప్రకృతి వైపరీత్యాలకు నిర్వహణ నిధి, పన్నుల ద్వారా 2014-15 నుంచి 2018-19 వరకు కేంద్రం రాష్ట్రానికి  రూ. 1,23 లక్షల కోట్లు విడుదల చేసినట్లు  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ వెల్లడించారు. 

పైగా, రిసోర్స్ గ్యాప్ నిధుల కింద మూడేళ్లకు రూ. 3,979.50 కోట్లు, వెనుకబడిన జిల్లా అభివృద్ధికి ఏడాదికి రూ. 350 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ. 1050 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,764.70 కోట్లు, ఈఏపీ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు వడ్డీగా రూ. 15.81 కోట్లు మొత్తం కలిపి రూ. 14,310.01 కోట్లు రాష్ట్రానికి ఇచ్చారని వివరించారు. 

ఇవి కాక ఎయిమ్స్‌కు రూ. 233.88 కోట్లు, ఐఐటీకి రూ. 98.29 కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ. 20.10 కోట్లు, ఎన్‌ఐటీకి రూ. 60కోట్లు, ఐఐఎంకు రూ. 49.96 కోట్లు, ఐఐఎస్‌ఈఆర్‌కు రూ. 64 కోట్లు, వ్యవసాయ వర్శిటీకి రూ. 135 కోట్లు, పెట్రోలియం వర్శిటీకి రూ. 33 కోట్లు విడుదల చేశారని చెప్పారు.

ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులు, చేసిన ఖర్చులు  శ్వేతపత్రాల్లో బహిర్గతపరచాలని కన్నా డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయడం లేదని, కడప స్టీల్ ప్లాంట్‌కు అనుమతిని ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించి ఆదుకుందని స్పష్టం చేశారు.   

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి డిసెంబర్ 11న ప్రతిపాదన చేస్తే దానికి డిసెంబర్ 20న జవాబు పంపారని తెలిపారు. కర్మాగారానికి అవసరమయ్యే ముడి ఇనుము లభ్యతపై సమాచారం ఇవ్వాలని డిసెంబర్ 20న జరిగిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం రాష్ట్రానికి కోరగా  ఆ సమాచారం ఇవ్వకుండా కడపలో ఉ క్కు కర్మాగారం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు.