చంద్రబాబు కేంద్రం నిధులు ఇవ్వడం లేదా ? కేసీఆర్ ప్రశ్న

ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆర్థిక సంఘం ముందు బాధలు చెప్పుకున్నామని,  ఏపీకి ఆదాయం తగ్గే అవకాశముందని  ఐదేళ్లపాటు లోటు ఉండే అవకాశముందని, రూ.25వేల నుంచి రూ.40 వేల కోట్లు ఇవ్వాలని సూచించిందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలిపారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తోందని,  ఆ లోటు సొమ్మును ఇస్తోందని అంటూ "మీకు నిధులు ఇవ్వడం లేదా? కేంద్రం నుంచి లోటు నిధులు తీసుకుంటున్నది అబద్ధమా?" అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. 

"24 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థికసంఘం సిఫారసు చేసిన విషయం వాస్తవం కాదా? కేంద్రం ఆ నిధులు ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఆ డబ్బులు నీవు (చంద్రబాబు) తీసుకుంటున్నావా లేదా? మరీ నీవు బీద అరుపులు అరుస్తున్నావు. నీకు సక్కగా పరిపాలించక రాక, నీకు తెలివి లేక, నీకు చేతగాక.. నీకు ప్రజాసంక్షేమం మీద దృష్టి లేక.. ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చే పరిస్థితి లేక మాట్లడుతున్నవు" అంటూ చంద్రబాబును కేసీఆర్ నిలదీశారు.   

చంద్రబాబు ఎంత దుర్మార్గుడంటే... 56 లక్షల చదరపు అడుగుల సచివాలయం, 12,016 చదరపు అడుగుల అసెంబ్లీ అని ప్రకటనలు ఇచ్చారని కేసీఆర్ విస్మయం వ్యక్తం చేశారు.  50 రోజులు నడిచే అసెంబ్లీకి అంత స్థలం అవసరమా? అని ప్రశ్నించారు.  ఉమ్మడి రాష్ట్ర సచివాలయం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని చెబుతూ  ఇంత భారీ నిర్మాణాలంటే ఇందులో ఏదో గోల్‌మాల్‌ ఉన్నట్లే కదా అని కేసీఆర్ నిలదీశారు. 

తెలంగాణ ప్రభుత్వం  ప్రతిపాదించిన సచివాలయం, కళాభారతి, అసెంబ్లీ కలిపి రూ.250 కోట్లు అనుకున్నామని,  మంచి ఫర్నీచర్‌ అనుకుంటే మరో రూ.250 కోట్లు కావచ్చని చెప్పారు. కేంద్రం పరిపాలన భవనాలకు రూ.1500 కోట్లు ఇచ్చిందని చెబుతూ వాటిని మింగేశారా? హైకోర్టు కట్టేందుకు కేంద్రం రూ.500 కోట్లు ఇస్తే ఏం చేశారు? అంటూ ప్రశ్నించారు. 

ఏపీ సచివాలయానికి రాఫ్ట్‌ సిస్టమ్‌తో ఫౌండేషన్‌  వేసిన్నట్లు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వాణిజ్య ప్రకటనను కేసీఆర్ ఎద్దేవా చేసారు. వేశారట. ఇది తొలిసారి అని చంద్రబాబు చెబుతున్నారని అంటూ ఆయనకు తగ్గట్లు పత్రికలు రాస్తున్నాయని అవహేళన చేసారు. హైదరాబాద్‌లో రాఫ్ట్‌ టెక్నాలజీతో నిర్మించిన భవనాలు వెయ్యి దాకా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో కట్టే చాలా భవనాలు, బలహీనవర్గాలకు కట్టించే ఇళ్లలోనూ ఇదే సాంకేతికత ఉపయోగిస్తున్నామని చెబుతూ  భగీరథలో ట్యాంకులు కూడా రాఫ్ట్‌ ఫౌండేషనే అని తెలిపారు. 

ఐటీపై డబ్బా కొట్టుకొంటున్న చంద్రబాబు 


సైబర్స్‌ టవర్స్‌కు శంకుస్థాపన చేసింది మాజీ ముఖ్యమంత్రి జనార్దన్‌రెడ్డి అని చెబుతూ దాన్ని తానే చేశానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచం మొత్తంలో సేఫ్‌ జోన్‌ ఎక్కడుంటే అక్కడ తమ డేటాను దాచుకునే ఏర్పాటు చేస్తాయని తెలుపుతూ  రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు ప్రపంచమంతా వెతకగా హైదరాబాద్‌ అత్యంత సురక్షిత ప్రాంతంగా తేలిందని తెలిపారు. 

తర్వాత ఈ కంపెనీల వాళ్లు రాజీవ్‌గాంధీని కలిశారని, అప్పుడు ఇక్కడ నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి. కావడంతో రాజీవ్‌గాంధీ ఆయనను పిలిచి.. ఐటీ కంపెనీల ప్రణాళిక గురించి చెప్పారుని వివరించారు.  అలా సైబర్‌ టవర్‌కు రాజీవ్‌, జనార్ధన్‌రెడ్డిలు ఆద్యులయ్యారని కేసీఆర్ స్పష్టం చేశారు. సైబర్‌ టవర్‌కు పునాది వేసింది జనార్దన్‌రెడ్డి. స్వాభావిక, భౌగోళిక సానుకూలతల వల్ల హైదరాబాద్‌కు ఐటీ వచ్చింది కానీ చంద్రబాబు వల్ల కాదని పేర్కొన్నారు.