రుణమాఫీ అంటూ మభ్యపెట్టే లాలీపాప్‌ కంపెనీ కాంగ్రెస్

  చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా రుణమాఫీలంటూ రైతుల్ని లాలీపాప్‌లతో (తాయిలాలతో)  కాంగ్రెస్ పార్టీ  తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నిశితంగా విమర్శించారు ఆరోపించారు.  ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నేతలు చెబుతున్న అసత్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో  జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  తనను ‘కాపలాదారుడు’ అంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. తాను కాపలాదారుడిగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, దీంతో కొందరు దొంగలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేసారు. తొలుత ఘాజీపూర్‌లో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మహారాజా సుహేల్‌దేవ్‌‌ స్మారక స్టాంపులను విడుదల చేశారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ నమ్మించి, మభ్యపెట్టింది. 800 మంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. ఎంతటి మోసం అంటూ ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నేతలు చెబుతున్న అసత్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను వారించారు.  మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగా  అప్పుడే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాని చెప్పారు. యూరియా కోసం బారులు తీరి నిలబడుతున్నారని ధ్వజమెత్తారు. 

హామీలను నెరవేర్చడానికి బదులు లాలీపాప్‌లు ఇస్తోంది. ఈ లాలీపాప్‌ సంస్థను మీరు ఎలా నమ్మగలరు?  అంటూ ప్రధాని ప్రశ్నించారు. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ రైతు రుణమాఫీ చేయలేదని, ఇప్పుడెలా చేయగలదని నిలదీశారు.  "మీ కాపలాదారుడు (నేను) రాత్రింబవళ్లు కష్టపడి, నిబద్ధతతో పనిచేస్తున్నాడు. మీరు నాపై నమ్మకాన్ని ఇలాగే ఉంచి, నన్ను ఆశీర్వదించండి. దొంగలను ఏదో ఒక రోజు సరైన ప్రదేశానికి (జైలుకి) పంపడానికి మీ నమ్మకమే నాకు బలాన్నిస్తుంది"అని మోదీ పేర్కొన్నారు. 

పూర్వాంచల్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, యూపీలోని చిన్న పరిశ్రమలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారి హెల్త్‌కేర్‌కు అధిక ప్రాధ్యాన్యమిస్తూ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను అమలు చేస్తున్నట్లు చెప్పారు. వారణాసిలో రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, వారణాసి, ఘాజీపూర్‌లలో కార్గో సెంటర్లు, గోరఖ్‌పూర్‌లో ఫెర్టిలైజర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని మోదీ విమర్శించారు.

వారణాసిలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రాన్ని ప్రధాని మోదీ శనివారం జాతికి అంకితమిచ్చారు. దక్షిణాసియాలో వరి పరిశోధనలకు ఈ కేంద్రం హబ్‌గా సేవలు అందించనుంది. అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ... తక్కువ నీటిలో సాగయ్యే, అధిక పోషకాలు కలిగిన వివిధ రకాల వరి వంగడాలను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని చెప్పారు. 

దక్షిణాసియాలో వరి ఉత్పాదకతను పెంపొందించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సుమారు రూ.180 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే బదలాపూర్‌లో నిర్వహించిన వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ ప్రాంతీయ సదస్సుకు కూడా ఆయన హాజరయ్యారు. స్థానికుల ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించారు.