చంద్రబాబంత పరమ చెత్త నేత మరొకరు లేరు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంత పరమ చెత్త నాయకుడు దేశంలో ఎవరూ లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పచ్చి స్వార్థపరుడు, అబద్ధాలకోరు అని, రాజకీయ స్వార్థం కోసం ఏమైనా చేస్తారని విరుచుకుపడ్డారు. నీతి, జాతి లేని చంద్రబాబు స్వయంప్రకాశమున్న నాయకుడు కానేకాడని, తెలివిలేని దద్దమ్మ అని మంది పడ్డారు. చంద్రబాబుకు నాలుగు ఇంగ్లిష్ ముక్కలు రావు, రెండు హిందీ ముక్కలు రావు.. జాతీయస్థాయిలో రాజకీయాలు చేస్తాడా? అని ఎద్దేవాచేశారు. 

జాతీయస్థాయిలో చంద్రబాబు ఎన్నడూ చక్రం తిప్పింది లేదని, డబ్బా పేపర్లు బాబుకు డబ్బా కొడుతున్నాయితప్ప చేసిందేమీలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తది.. అవసరమే లేదని మొన్నటిదాకా వాదించి.. ఇప్పుడు హోదా ఇవ్వలేదని అనడానికి చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉండాలని పేర్కొన్నారు. ఐటీలో కూడా చంద్రబాబు పీకిందేమీ లేదని.. సైబర్ టవర్స్‌కు ఆద్యులు దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ, దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అని తెలిపారు. 

దేశ ప్రయోజనాల కోసం తాను ప్రతిపాదిస్తున్న ఆర్థిక మోడల్, అగ్రికల్చర్ మోడల్‌పై చంద్రబాబుకు కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ ఫలితంపై తనకు తొందరేంలేదని, అందుకు సమయం పడుతుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. చంద్రబాబులాంటోడితోనే జై తెలంగాణ అనిపించలేదా? అని అడిగారు. 

చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడుతూ  ఆయన పచ్చిఅబద్ధాల కోరు, అవకాశవాది అని.. వాడుకుని వదిలేయడంలో నంబర్‌ వన్‌ అని విమర్శించారు. రాజకీయాల కోసం ఆయన ఎవరినైనా బలిచేస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు టిడిపికి అధ్యక్షుడు కాదు మేనేజర్‌ అని, ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని లాక్కున్నారని, హరికృష్ణ మరణంపైనా రాజకీయాలు చేశారని విమర్శించారు  

చంద్రబాబుకు మాట మీద నిలబడే తత్వం ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. డిసెంబరు నాటికి హైకోర్టు భవనాలు సిద్ధం చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ హైకోర్టును అక్కడికి మార్చుకోవాల్సింది పోయి అనవసర విమర్శలు చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. 

 రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా హైకోర్టుకు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఎవరి తప్పని ప్రశ్నించారు. ఏర్పాట్లు చేయకుండా హైకోర్టు విభజన చేశారని చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఉందా అని నిలదీశారు.  హైకోర్టును విభజించింది కేంద్రం కాదు.. సుప్రీంకోర్టు. తీర్పులో ఉన్నదే నోటిఫై చేశారు. కేంద్రంపై ఎలా ఆరోపణలు చేస్తారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.