సంక్రాంతికి అమరావతిలో హై కోర్ట్

తెలుగు రాష్త్రాల `ఉమ్మడి హై కోర్ట్’ విభజనకు సంబంధించి ఒకటి, రెండు రోజులలో రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయనున్నారని తెలుస్తున్నది. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్నా భవనాల నిర్మాణం పూర్తి కాగానే, జనవరి నుండి నవ్యాంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ పనిచేయడం ప్రారంభం కాగలదని భావిస్తున్నారు. జనవరి ఒకటి నుంచే రెండు రాష్ట్రాల హైకోర్టులు వేరు పడి పోయి, సంక్రాంతి సెలవుల తర్వాత నవ్యాంధ్ర హైకోర్టు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభిస్తుందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా హైకోర్టు మాత్రం ఉమ్మడిగానే ఉంది. హైకోర్టు విభజన కోసం మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, నవ్యాంధ్రలో పూర్తి సదుపాయాలుంటే తప్ప హైకోర్టును విభజించలేమని ఉమ్మడి హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది.

తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు విజయవాడలో రెండు మూడు ప్రాంగణాలను పరిశీలనలోకి తీసుకున్నా అవేవీ ఖరారు కాలేదు. మరోవైపు అమరావతిలో హైకోర్టును ప్రతిష్ఠాత్మకంగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన డిజైన్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుందని తాత్కాలిక ప్రాతిపదికన హైకోర్టు భవనాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. 

నేలపాడు, తుళ్లూరు గ్రామాల పరిధిలో ‘జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌’ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణ పనులను గత శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కైత్‌, జస్టిస్‌ సీతారామమూర్తి పరిశీలించారు. అలాగే అమరావతిలో నిర్మిస్తున్న జడ్జిల బంగళాలు, ఐఏఎస్‌ అధికారుల నివాసాలను కూడా న్యాయమూర్తులు పరిశీలించారు. జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు ఈ భవన సముదాయం సరిపోతుందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులన్నీ అక్టోబరు నాటికి పూర్తవుతాయని,  ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌ ఏర్పాటుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌ సహా మొత్తం పనులు డిసెంబరు ఆఖరునాటికి పూర్తవుతాయని చెబుతున్నారు.