త్రిపురలో 158 సీట్లలో 157 గెలుపొందిన బీజేపీ

త్రిపురలో బిజెపి విజయ పదాంకు అడ్డు లేకుండా పోతున్నది. సుదీర్ఘకాలం రాజ్యమేలిన సిపిఎం నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేక పోతున్నది. ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికలలో సహితం అసాధ్యమైన విజయం సాధించింది. 

మొత్తం 158 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా బిజెపి 157 స్థానాలను కైవసం చేసుకొంది. వాటిల్లో 91 చోట్ల అసలు పోటీ లేకుండా ఏకగ్రీవంగగా గెల్చుకొంది. పోటీ జరిగిన 67 స్థానాలలో 66 స్థానాలను గెల్చుకొంది. పట్టణ ప్రాంతాలలోని స్థానిక సంస్థలలో కౌన్సిలర్ పదవులకు ఈ ఉపఎన్నికలు గురువారం జరిగాయి. 

బిజెపికి ఘనమైన విజయాన్ని అందజేసిన త్రిపురలో పట్టణ ప్రజలకు ముఖ్యమంత్రి బిపీలాబ్ కుమార్ దేవ్ కృతజ్ఞతలు తెలియపరు. ఈ స్థానాలు అగర్తాల పురపాలక సంఘంతో పాటు రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాలకు వ్యాపించి ఉన్నాయి. కేవలం పనిసాగర్ పురపాలక సంఘంలో ఒక్క సీట్ ను మాత్రం సిపిఎం గెల్చుకోగలిగింది. ఈ పట్టణంలో మిగిలిన 10 సీట్లను కూడా బిజెపి గెల్చుకొంది. 

49  మంది సభ్యులున్న రాష్ట్ర రాజధాని అగర్తలా పురపాలక సంఘంలో నాలుగు వార్డ్ లకు జరిగిన ఉప  ఎన్నికలలో బిజెపి గెలుపొందింది. గురువారం జరిగిన ఎన్నికలలో అత్యధికంగా 81.36 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తమ తమ పట్టణాలలో కూడా అమలు పరచాలని కోరుకొంటున్న ప్రజలు బిజెపికి పట్టం గట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.