పోలవరం ఎడమ వైపు కనెక్టవిటీ పనులన్నీ నత్తనడకనే

ఒకవైపు రికార్డులు సృష్టిస్తూ శరవేగంగా  పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు ఘనంగా ప్రచారం చేసుకొంటూ ఉంటె, పనులు పాక్షికంగా, ఎక్కువగా ఒకవైపు పనులే జరుగుతున్నాయి గాని, అనేక పనులను అసలు పట్టించు కోవడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. 

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, కాపర్ డ్యామ్‌లు, గేట్లు పనులనే ప్రధానంగా పరుగులు పెట్టిస్తున్నారు కానీ హెడ్ వర్క్సులో మిగతా పనుల పురోగతి మందగించింది. అయినా పట్టించుకునే పరిస్థితి కనిపించడంలేదు. ప్రధానంగా ప్రాజెక్టు ఎడమ వైపు కనెక్టవిటీ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని చెప్పొచ్చు. 

హెడ్ వర్క్సులో ఈ మొత్తం పనులు పూర్తయినపుడే లక్ష్యం మేరకు 2019 కల్లా ప్రాజెక్టు నుంచి నీరు పారించడానికి అవకాశం ఉంటుంది. కనెక్టవిటీలు పూర్తి కాకుండా ప్రాజెక్టు పూర్తయినట్టు కాదు. ఇందులో భాగంగా ఎడమ గట్టు వైపు నేవిగేషనల్ లాక్‌లు, నేవిగేషన్ కెనాల్ తదితర పనులు కూడా పూర్తి చేయాల్సివుంది. 

ఈ నేపథ్యంలో ప్యాకేజీ నెంబర్ 67లో ఇనె్వస్టిగేషన్, సాయిల్ ఎక్స్‌ఫ్లోరేషన్, డిజైన్ల రూపకల్పన, నేవిగేషనల్ లాక్స్ 1, 2, 3, నేవిగేషన్ కెనాల్, కెనాల్ సైఫాన్ తదితర పనులతో ప్యాకేజీ నెంబర్ 67గా నిర్ధేశిస్తూ ప్రాజెక్టు ఎడమవైపు కనెక్టవిటీలకు హెడ్ వర్క్సు చేపట్టారు. అయితే ఈ పనుల్లో గత కొంత కాలంగా ఆశించిన పురోగతి కన్పించడం లేదని తెలుస్తోంది. 

అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లలో ఈ పనులు పూర్తికావాల్సి వుంది. ఈ పనుల్లో ఇప్పటికొచ్చి ఆశించిన కదలిక కన్పించడం లేదు. ఇదే ప్యాకేజీలో ఫ్లడ్ గేట్ స్ట్రక్చర్, లాక్ నెంబర్ 3 వరకు వరద గట్టు నిర్మాణాన్ని అదనంగా చేర్చారు. ఈ 67 ప్యాకేజీ పనులను జాయింట్ వెంచర్‌గా శ్రీ జయ, కె శివరావు అనే పేర్లతో జేవీ సంస్థ చేపట్టింది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ మొత్తం రూ.77 కోట్లు అయితే, అనుబంధ అగ్రిమెంట్ మరో రూ.9.797 కోట్లతో జరిగింది. వెరసి మొత్తం రూ.86.797 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు.

 అగ్రిమెంట్ గడువు రెండేళ్లు కాగా 2005లో పనులు చేపట్టి 2007లో పూర్తి చేయాల్సివుంది. వాస్తవానికి కాల్వ పనులతో పాటు ఈ పనులను కూడా 2005లోనే చేపట్టారు. కానీ అనుకున్నంత పురోగతి లేదు. ఇప్పటి వరకైతే 86.12 శాతం అంటే రూ.74.767 కోట్ల విలువైన పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మట్టి తవ్వకం పనులకు మరో రూ.5.91 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తున్నారు. 

ఈ పనులకు సంబంధించి అవసరమైన భూమి 90.32 ఎకరాలను అప్పగించారు. లాక్ 1, 2, 3, కెనాల్ సైపాన్, నేవిగేషన్ కెనాల్ పనులకు డిజైన్లన్నీ ఎపుడో ఆమోదం పొందాయి. మట్టి పని 7 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటి వరకు 6.62 లక్షల క్యూబిక్ మీటర్లు అంటే 94.50 శాతం పూర్తయింది. కాంక్రీటు లైనింగ్ 5.08 శాతం, స్ట్రక్చర్ కాంక్రీటు 99.22 శాతం పూర్తయింది. 

అదనంగా అప్పగించిన పనులకు సంబంధించి బ్యాంకింగ్ పూర్తికాలేదు. కాంక్రీటు 57.020 శాతం పూర్తయింది. పైల్స్ పూర్తయ్యాయి. మిగిలిన మేషనరీ, పైపులు, స్టోన్ డంపింగ్ పూర్తి చేయాల్సివుంది. ఈ ప్యాకేజీలో పనులకు సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా కూలీ పనుల నిమిత్తం రూ.3.85 కోట్లు, యంత్రాలకు రూ.1.25 కోట్లు వెరసి రూ.5.10 కోట్లు ఇచ్చారు. మొబిలైజేషన్‌లో వడ్డీ నిమిత్తం సుమారు రూ.70 లక్షల వరకు వసూలు చేశారు. 

ఏదేమైనప్పటికీ ఈ పనులను జనవరి నెలాఖరుకు పూర్తి చేయాల్సిందిగా లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి కావాలంటే సీడబ్ల్యూసీ నుంచి ఫ్లడ్ గేట్ డ్రాయింగ్ ఆమోదం లభించాల్సి వుంది. అదే విధంగా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పైపులైన్‌ను మార్చాల్సి వుంది. 2019 నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి ఈ పనుల దిశగా దృష్టి సారించాల్సి వుంది.