తెలంగాణాలో మూడు చోట్ల వాజపేయి అస్తికల నిమజ్జనం

మాజీ ప్రధాని వాజ్‌పేయి అస్థికలు, చితాభస్మాన్ని తెలంగాణ రాష్ట్రంలో మూడు చోట్ల నిమజ్జనం చేశారు. దేశవ్యాప్తంగా వాజ్‌పేయి అస్థికలను పుణ్యనదుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి కూడా నాలుగు కలశాలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని  ఈ కలశాలను బుధవారం రాత్రి  నుంచి గురువారం వరకూ పెద్ద ఎత్తున ప్రజలు సందర్శించుకొని నివాళులర్పించారు.

అనంతరం నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి రెండు రథాల్లో మూడు కలశాలను ప్రదర్శనగా తీసుకెళ్లారు. రథాల వెంట పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివెళ్లారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు నేతృత్వంలోని రథం పార్టీ కార్యాలయం నుంచి నల్గొండ క్రాస్‌రోడ్, కొత్తపేట, హయత్‌నగర్, చౌటుప్పల్,చిట్యాల, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా వాడపల్లిలోని త్రివేణీ సంగమం వరకూ సాగింది.

ఎక్కడికక్కడ ఈ రథం వెంట పార్టీ కార్యకర్తలు, అభిమానులు వెన్నంటి వచ్చారు. త్రివేణీ సంగమం వద్ద వాజ్‌పేయి చితాభస్మం, అస్థికలున్న కలశాన్ని నిమజ్జనం చేశారు.   అదే విధంగా ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి నేతృత్వంలోని రథంలో రెండు కలశాలను ప్రదర్శనగా తరలించారు. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ లోని మూడు నదుల సంగమం వద్ద మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి వాజ్‌పేయి అస్థికలు, చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు.

అనంతరం యాత్ర బండ్లగూడ, మెయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ మీదుగా అనంతగిరి వద్దకు రథం చేరుకొంది. అభిమానులు, కార్యకర్తల సమక్షంలో అనంతగిరిలోని మూసి సంగమంలో నిమజ్జనం చేశారు. పార్టీ కార్యాలయంలోని మరో కలశాన్ని డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలో నిమజ్జనం చేస్తారు.