జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణకు సిద్ధం

జమ్మూకశ్మీర్‌లో  శాసన సభ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం ఇచ్చారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుపై ప్రవేశపెట్టిన తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు హోం మంత్రి సమాధానం ఇస్తూ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఒక ప్రాంతీయ పార్టీకి బీజేపీ మద్దతిచ్చే ప్రయత్నం చేసిందంటూ విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను  తోసిపుచ్చారు. 

జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీ కానీ, కూటమి కానీ ముందుకు రానందున ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సిఫారసు చేయాల్సి వచ్చిందని తెలిపారు.  ప్రభుత్వం ఏర్పాటుకు నిజంగానే బీజేపీ 'బేరసారాలు' చేసి ఉంటే, ఆరు నెలల గవర్నర్ పాలనలోనే చేసి ఉండేదని చెప్పారు. 

కాశ్మీర్‌లోని అన్ని ప్రధాన పార్టీలతోనూ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా మాట్లాడారని, ప్రభుత్వం ఏర్పాటుకు ఏ ఒక్క పార్టీ ముందుకు రాకపోవడంతో గత జూన్‌లో ఆయన నివేదిక పంపారని హోం మంత్రి సభకు తెలిపారు. రాష్ట్రపతి పాలన విధింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయలేదని, అనైతిక చర్యకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఎన్నికల కమిషనేనని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభలో ఆమోదించారు.