ట్రక్కు గుర్తు ఎవ్వరికీ ఇవ్వొద్దు

ట్రక్కు గుర్తును ఎన్నికల్లో ఎవ్వరికీ కేటాయించొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఎన్నికల సంఘాన్ని కోరారు.  ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రధా న కమిషనర్‌ సునీల్‌ అరోరాతో ఆయన ప్రత్యే కంగా సమావేశం అయ్యారు. దాదాపు  45 నిమిషాల పాటు సాగిన భేటీలో సీఎం, ఎన్నికల కమిషన్‌ దృష్టికి పలు అంశాలు తీసుకువచ్చారు. 

ఇటీవల తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసినందుకు ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టే, హ్యాట్‌ సింబల్స్‌పై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌తో సీఎం కేసీఆర్‌ చర్చించారు. వీటి వల్ల శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు కారు గుర్తును పోలి ఉండటంతో గందరగోళానికి గురైనట్టు తెలిపారు. 

దాదాపు 15 నియోజవర్గాల్లో అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగిందని ఈసీకి తెలిపారు. మరికొన్ని నియోజకవర్గాల్లో వెయ్యి మేర ఓట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పారు. గుర్తుతో పాటూ, అభ్యర్థి పేరును సైతం ఒకే విధంగా ఉండటంతో ఓటర్లు కమ్‌ఫ్యూజ్‌ అయ్యారని తెలిపారు. అందువల్ల ట్రక్కు గుర్తును రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎవ్వరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లకు అనువుగా గుర్తులు ఉండాలని, ఓటర్లను గందరగోళానికి గురి చేసే విధంగా ఉండకూడదని సీఎం చెప్పారు. 

ఎన్నికల ముందే ఈ అంశంపై తాము కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో చర్యలు తీసుకోలేదని చెప్పారు. అయితే, సీఎం కేసీఆర్‌ విన్నపాలపై ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా సానుకూలంగా స్పందించినట్టు టీఆర్‌ఎస్‌ అధికారవర్గాలు  వెల్లడించాయి.