కడప ఉక్కుపై చంద్రబాబు గుట్టు రట్టు చేసిన కేంద్రం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సహకరించక పోవడం వల్లననే కడప ఉక్కు సాకారం కావడం లేదని స్పష్టం చేయడం ద్వారా ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్రం ఎండగట్టింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్‌ నివేదిక చెప్పిందని వెల్లడించనా, రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇప్పటికీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన గనుల లభ్యత, ముడి ఇనుము, నిల్వలకు సంబంధించిన వివరాలు అందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో ఆరోపించింది. 

ముడి ఇనుము లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలు తీసుకుంటోందని, కడపలో స్టీల్‌ ప్లాంట్‌పై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించింది. టాస్క్‌ఫోర్స్‌ ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ నెల 17న టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగిందని, టాస్క్‌ఫోర్స్‌ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంది.

అటవీ, పర్యావరణ అనుమతుల నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, వారు కేంద్రంతో సహకరించనందువల్లే మెకాన్‌ సంస్థ తుది నివేదిక ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వివరించింది. ఏపీ సమాచారం ఇవ్వగానే మెకాన్‌ సంస్థ స్టీల్‌ ప్లాంట్‌పై తుది నివేదిక ఇస్తుందని, పెట్టుబడులకు ఉన్న మార్గాలను కూడా మెకాన్‌ సంస్థే సూచిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక, స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను నిర్దేశిస్తుందని పేర్కొంది.

 కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ ఏపీ ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని, వారితో పాటు భాగస్వాములతోనూ చర్చలు కొనసాగిస్తున్నారని కేంద్రం స్పష్టంచేసింది. టాస్క్‌ఫోర్స్‌ నివేదికలో పొందుపర్చే అంశాలపైనా బీరేంద్రసింగ్‌ చర్చిస్తున్నారని పేర్కొంది. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపింది. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే మెకాన్‌ నివేదికను సిద్ధం చేస్తోందని కేంద్రం వెల్లడించింది.