వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముందస్తు జపం

ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చలేక పోవడంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేవలం తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మలిచేందుకు మాత్రమె ముందస్తు జపం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు డా. కే లక్ష్మణ్ విమర్శించారు. ముందస్తు ఎన్నికలు జరిగితే  ప్రజలు కూడ ముందస్తుగానే టీఆర్‌ఎస్  పార్టీని  ఇంటికి పంపేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. తాము గులాబీ గడీలను బద్దలుకొట్టి తీరుతామని స్పష్టం చేస్తూ సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గత రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  ఏరంగంలో చూసినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలే కనిపిస్తున్నాయని తెలిపారు. వాటిని కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికలంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేసారు. మహిళలను అవమానపర్చిన ఘన చరిత్ర టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని అంటూ ఇక్కడి చేనేత కార్మికులను విస్మరించి సూరత్ నుంచి చీరలను తీసుకొచ్చి ఆడపడుచులను అవమానపర్చారని ద్వజమెత్తారు. ఆడపడుచుల శాపనార్థాలతో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. చేనేత కార్మికుల కడుపుకొట్టి టీఆర్‌ఎస్ నాయకులు ప్రజాధనాన్ని దోపిడి చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడ స్థానం కల్పించక పోవడంతో మహిళల పట్ల కెసిఆర్ కున్న ప్రేమ తెలిసిపోతుందని ద్వజం ఇచ్చారు. అదే బీజేపీ పార్టీ దేశ రక్షణ మంత్రి, విదేశి వ్యవహారాల మంత్రి, పార్లమెంటు స్పీకర్ పదవులను మహిళలకు ఇచ్చి గౌరవించిందని, మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేసారు.

పార్లమెంటులో త్రిపురలో ఇద్దరు ఎమ్మెల్యేలు, అస్సోంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని అంటూ తెలంగాణలో పంచపాండవులుగా  ఉన్న ఎమ్మెల్యేలు మోడి బ్రహ్మాస్త్రంతో గులాబీ గడీలను బద్దలుకొట్టి తీరుతామని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసారు.

ఈ సభలో  ప్రముఖ న్యాయవాది వెంకటాద్రిరెడ్డి బిజెపిలో చేరారని అంటూ ఇక్కడి నుంచే బీజేపీ జైత్రయాత్రను ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన నాయకత్వంలో ఎంతో మంది పార్టీలో చేరారని జోగుళాంబ గద్వాల జిల్లాలో కాషాయజెండా ఎగురేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలోని మంత్రులు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారని అంటూ కళ్లుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని మంత్రులు నడిగడ్డకు వస్తే బీజేపీ సత్తా ఏమిటో, బీజేపీ పార్టీ ఎక్కడుందో తెలుస్తుందని పేర్కొన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేసారు. అడుగడుగునా అవినీతి మయంగా రాష్ట్రం మారిపోయిందని అంటూ ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదని ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.  

సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమౌతుందని చెబుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చి సమన్యాయం చేస్తుందని, అందువల్లే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీయే గెలుస్తున్నదని చెప్పుకొచ్చారు.  కాంగ్రెస్ పార్టీ దేశంలో గల్లంతయ్యిందని, రాహుల్‌గాంధీ కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినా ఓటమి తప్పడం లేదని ఎద్దేవా చేసారు.

నరేంద్రమోడి నాయకత్వంలో నేడు దేశంలో 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, కేవలం రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్ పరిమితమైందని చెప్పారు.  బీజేపీ పార్టీలో ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువమంది ఎంపీలుగా ఉన్నారని అంటూ దేశంలో బీజేపీ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక దళిత వ్యతిరేక ముద్ర వేసి దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడితే మాదాసి కుర్వలను ఎస్సీ జాబితాలో చేరుస్తామని, వాల్మీకి బోయల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.