రుణమాఫీఫై రైతులను వెర్రివాళ్లను చేస్తున్న కాంగ్రెస్

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తూ వారిని వెర్రివాళ్లను చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదన్న సంగతి మనం మరువరాదని ఆయన గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ధర్మశాలలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ  ‘ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్’ ఇవ్వాలన్న సైనికుల డిమాండ్ విషయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వారిని తప్పుదోవ పట్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

మోదీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసేంత వరకు నిద్రపోనివ్వమని ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో ఆరులక్షల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తామని 2009లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం 60వేల కోట్ల రుణాలను మాత్రమే రద్దు చేసిందని ఆయన చెప్పారు. పైగా రుణమాఫీ రద్దు పథకం కింద రైతులు కాని వారు లక్షలాది మంది లబ్ధి పొందగా, అసలైన కర్షకులకు అన్యాయం జరిగిందని, కాగ్ నివేదిక సైతం ఈ విషయాన్ని నిర్ధారించిందని ఆయన తెలిపారు. 

ఇదేమాదిరి వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిందని, కాని మాఫీ చేయడంలో విఫలం అయ్యిందని మోదీ విమర్శించారు. రుణమాఫీ కింద ఇంతవరకు పంజాబ్ రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోగా, కర్నాటకలో 800 మందికి మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 

కేంద్రం, రాష్ట్రాల్లో రుణమాఫీకి సంబంధించి తాము చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేసామని కాంగ్రెస్ చేస్తున్న వాదనను మోదీ ప్రస్తావిస్తూ గతంలో అధికారంలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సైతం సైనికుల పింఛన్ విషయంలో ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి బడ్జెట్‌లో స్వల్ప మొత్తాన్ని మాత్రమే దానికి కేటాయించి వారిని తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. 

కాని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ప్రధాని  ప్రకటించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయంలో రూ  90 వేల కోట్లను బోగస్ లబ్ధిదారులకు పెన్షన్ స్కీంల కింద ఇచ్చారని మోదీ ఆరోపించారు. కాపలాదారుడే దొంగగా మారాడంటూ తనపై రాహుల్‌గాంధీ చేస్తున్న వ్యంగ్య విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ‘అవును.. ఈ కాపలాదారుడు కుంభకోణదారులు పారిపోకుండా చూస్తాడు’ అని వ్యాఖ్యానించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో రూ 26 వేల కోట్ల విలువైన వివిధ అనివృద్ధి ప్రాజెక్టులు చేపట్టామని మోదీ వెల్లడిస్తూ, సాహసవంతులైన సైనికులు పుట్టిన గడ్డ అని, వారు దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెరవరని ప్రశంసించారు. హిమాచల్‌ప్రదేశ్ తన సొంత ఇంటి వంటిదని, పార్టీకి సంబంధించి తాను ఇక్కడ చాలా సంవత్సరాలు పనిచేశానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభు త్వం చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలను వివరించే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సహకారంతో చేపట్టిన పథకాలను వివరించే ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రేమ్‌కుమార్ దుమాల్‌తో పాటు బీజేపీ ఎంపీ శాంతకుమార్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్పకాష్ నడ్డా, గవర్నర్ ఆచార్య దేవ్త్ తదితరులు పాల్గొన్నారు.