ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానించాలి

ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) సునీల్‌ అరోడాకు బిజెపి  నేతలు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో బీజేపీకి  జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృంద సభ్యులు గురువారం సీఈసీని కలిశారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో 2014-18 మధ్య చోటుచేసుకున్న తేడాలను వివరించారు.

హైదరాబాద్‌లోని ఓ వర్గం ఓటర్లు ఉన్నచోట అసాధారణంగా ఓట్లను నమోదు చేశారని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో అర్హుల పేర్లను తొలగించారని పేర్కొన్నారు.  ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు.. నమోదు.. ఒకే ఇంట్లో.. ఒకే పేరుతో పదుల సంఖ్యలో నమోదైన ఓటర్ల వివరాలకు సంబంధించి ఆధారాలను ఈసీకి అందజేశారు. 

అనంతరం మురళీధర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల తొలగింపు.. నమోదులో లోపాలను ఎప్పటికప్పుడు తమ పార్టీ లేవనెత్తుతూనే ఉందని చెప్పారు. ఫలితాలు ఎలా ఉన్నా కాంగ్రెస్‌, టిడిపిలా తాము ఈవీఎంల విషయంలో స్పందించబోమని స్పష్టం చేశారు. 

లక్ష్మణ్‌ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు లక్షలాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగానే ఓట్ల తొలగింపు జరిగిందని ధ్వజమెత్తారు. తాము ఫిర్యాదు చేసిన అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారని పేర్కొన్నారు. సీఈసీని కలిసిన బృందంలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు, నాయకులు ఇంద్రసేనారెడ్డి, మనోహర్‌రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరమణ ఉన్నారు.