సహనం భారతీయుల డీఎన్‌ఏలోనే ఉంది

ఇమ్రాన్ ఖాన్ పై నఖ్వీ మండిపాటు 

సహనం భారతీయుల డీఎన్‌ఏలోనే ఉందని అంటూ భారత దేశంలో మైనారిటీల గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వాఖ్యలపై కేంద్ర మంత్రి అబ్బాస్‌ నఖ్వీ   ని తీవ్రంగా విరుచుకుపడ్డారు.  

భారత్‌లోని మైనార్టీ వర్గానికి చెందిన ప్రజల పరిస్థితిపై ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ భారతీయులందరూ సురక్షితంగానే ఉన్నారని, ఆయన తన దేశ ప్రజల గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు.  

 ఈ వారంలోనే రెండు సార్లు భారత్‌లోని మైనార్టీల పరిస్థితి గురించి ఇమ్రాన్‌ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌లో జరుగుతున్నట్లు కాకుండా, మా నయా పాకిస్థాన్‌లో మైనార్టీలను మిగతా ప్రజలతో సమానంగా చూస్తాం’ అని మంగళవారం వ్యాఖ్యలు చేశారు.

 ‘ఇమ్రాన్ వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. మతతత్వ, నియంతృత్వ శక్తులు ఆ దేశంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఆయన తన దేశంలో ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచిస్తే మంచిది. మా దేశంలో అందరు సురక్షితంగా ఉండటంతో పాటు ప్రగతి పథంలో ఉన్నారు. వారి భద్రతకు మా రాజ్యాంగం హామీ ఇచ్చింది' అని స్పష్టం చేశారు. 

‘1947 తరవాత పాకిస్థాన్‌లో మైనార్టీల జనాభా 23 శాతం ఉండగా, బంగ్లాదేశ్ ఏర్పడిన తరవాత అది 16 శాతానికి తగ్గిపోయింది. ఇప్పుడు మైనార్టీల జనాభా 1.2శాతానికి పడిపోయింది’ అని లెక్కలతో సహా చూపి పాక్‌ మీద మండిపడ్డారు. 

బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్‌ షా వ్యాఖ్యల అనంతరం గత శనివారం ఇమ్రాన్‌ స్పందిస్తూ మైనార్టీలను ఎలా చూసుకోవాలో తాను మోదీ ప్రభుత్వానికి చూపిస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.