నన్ను గద్దే దించితే అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఖతం !

అమెరికా అద్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి వివాదాస్పదంగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రత్యర్ధుల నుండే కాకుండా సొంత పార్టీ వారి నుండి కుడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్ తాజాగా తనను అభిసంసించే ప్రయత్నాలు జరుగుతూ ఉండటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే అమెరిక మార్కెట్లు కుప్పకూలి పోతాయని, అమెరిక ప్రజలంతా పేదలుగా మారిపోతారని అంటూ శాపాలు పెడుతున్నారు.

తనను అభిశంసించడానికి కాంగ్రెస్ వద్ద ఎటువంటి కారణం లేదని ట్రంప్ తేల్చి చెబుతూనే ఈ విధంగా బెదిరింపులకు దిగుతూ ఉండటం గమనార్హం.  ‘‘దేశం కోసం గొప్పగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఎలా అభిశంసిస్తారో నాకు అర్థం కావడం లేదు’’ అంటూ మరో వంక ఆమయకత్వం ప్రదర్శించే ప్రయత్నం చేసారు. ‘‘అయితే, మీకో విషయం చెప్పదలచుకున్నాను. ఒకవేళ నన్ను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలడం ఖాయం. అప్పుడు ప్రతీ ఒక్కరు పేదలుగా మారిపోతారు’’ అని ట్రంప్ తేల్చి చెప్పారు.

 అమెరికా ప్రచార ఆర్థిక చట్టాలను ఉల్లంఘించేలా ట్రంప్‌ వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ న్యూయార్క్‌లోని ఓ కోర్టులో వాంగ్మూలం ఇస్తూ, 2016 ఎన్నికలకు ముందు కొందరి నోళ్లు మూయించేందుకు డబ్బు చెల్లించినట్టు వెల్లడించారు. ట్రంప్‌తో వివాహేతర సంబంధాలున్న ఇద్దరు మహిళలకూ డబ్బులిచ్చినట్లు తెలిపారు. అయితే కోహెన్ చెప్పినవన్నీ కట్టు కథలని, అయితే కొందరి నోళ్లు మూయించేందుకు చెల్లించిన డబ్బు మాత్రం డబ్బు తనదేనని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా రాజ్యంగం ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర పౌర అధికారులు అంటే- న్యాయమూర్తులు, అధ్యక్షుడి కేబినెట్‌లోని సభ్యులను దేశద్రోహం, లంచగొండితనం వంటి ఆరోపణలు, నేరాలు, దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై తొలగించవచ్చు. అమెరికా చరిత్రలో ఇద్దరు అధ్యక్షులు అభిశంసనకు గురయ్యారు. 1868లో ఆండ్రూ జాన్సన్, 1998లో బిల్ క్లింటన్‌లు అభిశంసనకు గురయ్యారు.