పోలవరంను చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేశారు

ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును టీడీపీకి, చంద్రబాబుకు ఆదాయ వనరుగా మార్చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఊసెత్తలేదని, అదే పార్టీకి చెందిన వడ్డి వీరభద్రరావు, యర్రా నారాయణ స్వామి తదితరులు పోలవరం కోసం పాదయాత్రలు చేస్తే వారిని అణచివేసిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేయగా, 2004లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పనులు ప్రారంభించారను గుర్తు చేశారు.  రూ.10వేల కోట్ల ప్రాజెక్టును వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రూ.16 వేల కోట్లకు పెంచారని, అప్పటి వరకూ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థను కాదని, ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. దీనిలో కూడా చంద్రబాబు పాత్ర కీలకమని ఆరోపించారు. కిరణ్‌కుమార్ రెడ్డి పదవిని కాపాడుకునేందుకు అప్పట్లో చంద్రబాబుకు మేలు చేశారని అంటూ  మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం గళమెత్తుతున్నది బీజేపీ ఒక్కటేనని స్పష్టం చేశారు. 

విభజన సందర్భంగా పోలవరం కోసం రాజ్యసభలో చర్చజరుగుతుండగా అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యులు (ఒకరు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర సభ్యులు) ఏం చేశారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. అసలు పోలవరం వద్దని తెలంగాణా ప్రాంత సభ్యురాలు డిమాండ్ చేస్తే ఆంధ్ర ప్రాంత సభ్యులు వౌనంగా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచి పోలవరం మంజూరు చేస్తే, వాటిని ఆంధ్రలో కలిపేందుకు కృషి చేసిందెవరో గుర్తు చేసుకోవాలని కోరారు. 

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందే కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్డినెన్స్ ద్వారా ముంపు మండలాలను ఏపీకి బదలాయించారని గుర్తు చేశారు.
ఇది జరిగి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటైన తరువాత కూడా రెండేళ్ల పాటు పోలవరం ఊసెత్తని చంద్రబాబు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసమే 2017లో బాధ్యతలు నెత్తిన వేసుకున్నారని ఆరోపించారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.6,700 కోట్లు ఇస్తే ఇప్పటికీ పూర్తిగా ఖర్చు చేయని చేతగాని ముఖ్యమంత్రిగా విమర్శలు గుప్పించారు. 

ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తూ కేంద్రం సహకరించట్లేదంటూ అభాండాలు వేస్తున్న చంద్రబాబు ప్రధాన ప్రాజెక్టును పక్కనపెట్టి పుష్కర, పట్టిసీమ ఎత్తిలపోతల పథకాలను పూర్తి చేసుకుని కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఆర్‌ఆర్ ప్యాకేజీలను అమాంతం పెంచేసి, ఇచ్చిన వారికే మళ్లీమళ్లీ పరిహారం చెల్లిస్తూ వందల కోట్లు దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రక్తంలోనే అవినీతి ఉందని, పోలవరం, ఉపాధిహామీ, మెడ్‌టెక్ పార్కు ఇలా అన్ని ప్రాజెక్టుల్లోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

 ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రానికి రూ.40వేల కోట్లు కేంద్రం మంజూరు చేస్తే చెరువు పనుల పేరిట రూ.16వేల కోట్లు దిగమింగారని, ఇది చాలక చెరువుల్లో మట్టి కూడా అమ్ముకుని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన వైఖరితో రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్న చేశారని మండిపడ్డారు. మోదీ రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకు వస్తారంటూ ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు గ్రామాల్లో సిమ్మెంట్ రోడ్లు, ఎల్‌ఈడీ వెలుగులు ఎవరి ఘనతో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ఇచ్చిన 9.65 లక్షల ఇళ్లల్లో కూడా చంద్రబాబు కమిషన్లు మింగుతున్నారని ఆరోపించారు. 

పోవలరం పట్టాదా అంటూ నిలదీస్తున్న చంద్రబాబు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు సార్లు క్షేత్ర పర్యటనకు వచ్చారని, ప్రధాని మోదీ శ్రద్ధ తీసుకోకుండా ఇది జరిగేదా అని ప్రశ్నించారు. పత్రికా సంపాదకుల సమక్షంలో పోలవరంపై చర్చకు తాను సిద్ధమేనని, అందుకు చంద్రబాబు సమ్మతించాలని డిమాండ్ చేశారు.