బీసీ రిజర్వేషన్లను తగ్గింపుపై బిజెపి ఆగ్రహం

తెలంగాణలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రంగా ఆగ్రహం వ్యకతం చేసారు. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ గతంలో ఎస్సీలకు, ఎస్టీలకు, నేడు బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. 

 బీసీ జనాభా గణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిందని, అయినా బీసీలకు అన్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్ చేస్తున్న మోసాలను గమనించాలని కోరుతూ బీసీ గణాంక వివరాలను సర్వే చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు సక్రమంగా లేకపోవడం వల్ల వందల గ్రామ పంచాయతీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఓట్లకు గొర్రెలు- బర్రెలు అంటున్నారని, రాజ్యాధికారానికి బీసీలను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లలో న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం కొనసాగుతుందని, బీసీల పక్షాన నిలుస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గాలికి వదిలి ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారని, ఈ  ఫ్రంట్లు, టెంట్లు వారి కుటుంబం కోసమే తప్ప వేరే ఏం లేదని   ఎద్దేవా చేశారు. గతంలో ఇలాంటి ఫ్రంట్‌లు అన్నీ విఫలమయ్యాయని చెబుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు నిష్ఫలమని స్పష్టం చేశారు. వచ్చే  యూపీఎ మధ్యనే జరుగుతాయని  చెప్పారు. 

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని చెబుతూ కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం రావడం మోదీ ప్రధాని కావడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకూ బీజేపీ ఉద్యమాలు చేస్తుందని చెప్పారు.