కాంగ్రెస్ దరిద్రం టీడీపీకి ఎందుకు !

కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా స్వర్గీయ ఎన్ టి రామారావు తెలుగు దేశం పార్టీని ప్రారంభించగా, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సిద్దపడటం ఆ పార్టీలో తొలినుండి క్రియాశీలంగా ఉంటున్న నేతలు భగ్గుమంటున్నారు. తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. `కాంగ్రెస్ దరిద్రం మాకేంద్రుకు’ అంటూ డిప్యూటీ ఉపముఖ్యమంత్రి కె ఈ కృష్ణముర్తి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. దేశాన్ని దోచుకుని, రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే ప్రజలు బట్టలూడదీసి తంతారని అంటూ  రహదారులు-భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టంగానే చంద్రబాబును హెచ్చరించారు.

 

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఆ ఇద్దరు మంత్రులు బహిరంగంగా తేల్చి చెప్పగా, మరో అనేక మంది ఈ విషయమై లోలోపలనే భాగ్గుమంతున్నారు. అసలు అలాంటి ఆలోచనే లేదని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేయగా,  అలాంటి పరిస్థితే వస్తే పార్టీని వీడటానికీ వెనుకాడబోనని అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుపై అన్నీ వదంతులేనని స్పష్టం చేశారు.

‘కాంగ్రెస్‌ పార్టీతో టిడిపి పొత్తు అసాధ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ దరిద్రాన్ని అంటకట్టుకోం’ అని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌, ప్రధాని మోదీ, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మాకు బద్ధశత్రువులు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తేలేదు’ అని కృష్ణమూర్తి తేల్చి చెప్పారు.

‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ టిడిపి. మా పార్టీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కలిస్తే అంతకంటే దుర్మార్గం ఉండదు. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసి దోచుకుతిన్న కాంగ్రెస్‌తో కలవాలని భావిస్తే మొదట వ్యతిరేకించేది నేనే’ అని అయ్యన్న పాత్రుడు నిర్మొహమాటంగా చెప్పేశారు. ఒకవేళ తప్పనిసరై కాంగ్రెస్ తో కలిస్తే టిడిపిలో తాను ఉండలేనని స్పష్టం చేశారు.

“ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు. రాష్ట్ర ప్రజలు క్షమించరు. మా అధినేత చంద్రబాబు అటువంటి తప్పు చేస్తారని నేను భావించడం లేదు. రాజకీయంగా ఎంతో కీలకమైన ఇటువంటి అంశాన్ని పొలిట్‌బ్యూరోలో చర్చించకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు” అని తేల్చిచెప్పారు.

దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఉండకూడదనే భావనతో ఎన్టీఆర్‌ పగలనక, రాత్రనక కష్టపడి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని, కాంగ్రెస్‌ను తరిమికొట్టారని అంటూ చంద్రబాబు తప్పు చేయబోరని అనుకుంటున్నానని పేర్కొన్నారు.