కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరిన కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని,   అందుకు తగినట్టుగానే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.  దిల్లీలోని 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య  భేటీ జరిగింది. 

ఆయనను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మోదీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ర్టానికి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై మోదీతో కేసీఆర్ చర్చించారు. 

పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కేసీఆర్‌ కోరారు. దీంతో పాటు పలు రాజకీయ అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తున్నది. ఈ భేటీలో ప్రధానికి సుమారు 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కేసీఆర్‌ అందజేశారు. 

కేసీఆర్ అందజేసిన వినతిపత్రంలో ముఖ్యాంశాలు :

* తెలంగాణలో నూతన సచివాలయం, నూతన అసెంబ్లీ నిర్మాణానికి బైసన్‌ పోలో భూములను ఇవ్వాలి. అలాగే రక్షణ శాఖకు చెందిన భూములు, పరిసరాల్లో రోడ్ల విస్తరణ చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలి. 
* కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలి.
* హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
* కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
* హైదరాబాద్‌లో ఐఐఎస్‌ఈఆర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి.
* ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. 
* జహీరాబాద్‌లో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ మ్యానుఫేక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. 
* కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేయాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో ఉంది గనక వెంటనే మంజూరు చేయాలి. 
* కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నదీ జలాల పంపకంలో నెలకొన్న వివాదాలను ముగించేలా చొరవ చూపాలి.
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.  అందుకు తగినట్టుగానే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలి.
* ఏపీ విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలకు సంబంధించి వెంటనే విభజన ప్రక్రియను పూర్తి చేయాలి. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను అవకాశం ఉన్నంత త్వరగా నెరవేర్చాలి.  
* గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి. 
* వెనుకబడిన జిల్లాలకు ఏటా ఇచ్చే రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలి.